Friday, November 1, 2024

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖుల నివాళులు

Krishnam Raju: హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు రెబల్‌స్టార్ ప్రభాస్ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణంరాజు గుండెపోటుతో ఆదివారం పరమవదించారు.
హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన ప్రముఖులెందరో.. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి
శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’కి నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్‌కీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను!

మంచితనానికి మారు పేరు: బాలకృష్ణ
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

శ్రీ కృష్ణంరాజుగారి మరణం దిగ్బ్రాంతికరం: పవన్ కళ్యాణ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు.
సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

నాకు చాలా బాధాకరమైన రోజిది: మహేష్ బాబు
‘‘కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రభాస్‌, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

కృష్ణం రాజుగారికి నివాళులు: అల్లు అర్జున్

శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత కృష్ణంరాజు పార్థీవదేహం సందర్శించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివా‌సానికి చేరుకొని ఆయ‌న పార్ధివ దేహ‌నికి నివాళులు అర్పించారు. త‌ద‌నంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.

కృష్ణంరాజు గారితో కలిసి నటించడ గొప్ప గౌరవం: నాని
అద్భుతమైన జ్ఞాపకాలు పంచినందుకు ధన్యవాదాలు సార్. మీతో కలసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కృష్ణంరాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రభాస్‌ అన్న, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ప్రఖ్యాత నటులు కృష్ణంరాజు మృతికి ప్రజానాట్యమండలి సంతాపం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు, ఆయన అభిమానులుకు తీవ్రమైన లోటు అని ప్రజానాట్యమండలి సినిమా శాఖ అధ్యక్షులు వందేమాతరం శ్రీనివాస్, కార్యదర్శి మద్దినేని రమేష్, కోశాధికారి డాక్టర్ మాదాల రవి లు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రాజకీయాలలో కూడా కృష్ణంరాజు గారు తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని గుర్తుచేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

శ్రీ కృష్ణంరాజు గారికి అశ్రునివాళి: తెలుగు సినీ రచయితల సంఘం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, కోరుకుంటున్నారు అని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా కాలం చేసిన ప్రముఖ హీరో, నిర్మాత, వెండితెర రాజసం, మా తెలుగు సినీ రచయితల సంఘం సభ్యులు అయిన శ్రీ కృష్ణంరాజు గారికి అశ్రునివాళి అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఉమర్జీ అనురాధ గారు సంఘం తరఫున విడుదల చేసిన ఒక సంతాప సందేశంలో పేర్కొన్నారు.
తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ప్రెసిడెంట్ ఇన్చార్జి శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు శ్రీ కృష్ణంరాజు గారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అమెరికాలో ఉన్న రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుట్టి బ్రాహ్మణ గాతనని ఎంతో ప్రేమగా పిలిచేవారని, వారి హఠాన్మరణం తనకి వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని తెలిపారు. తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు బుర్ర సాయి మాధవ్ గారు తెలుగు సినీ పరిశ్రమకు రాజసం వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు.

ఇంకా చంద్రబాబు, కేటీఆర్, తలసాని, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి సినీ, రాజకీయ ప్రముఖులెందరో కృష్ణంరాజు పార్థివదేహం సందర్శించి నివాళులు అర్పించారు. కాగా, కృష్ణంరాజు గారి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్‌లో జరుగనున్నాయి. ఇంటి నుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరుతుందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x