Wednesday, December 25, 2024

కవిత్వ సంకీర్తనతో తరించి, తన్మయింప చేసిన సన్నిధానం శర్మ ప్రముఖ కవుల, సాహిత్యవేత్తలు ప్రశంస

మానవీయ ఆత్మీయ స్పర్శగా తెలుగు రాష్ట్రాల సాహిత్య కవిత్వ ప్రపంచంతో సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘ గాఢ సంబంధం ఉన్న ‘ప్రాణహిత’,’ ప్రమేయ ఝరి’ వంటి కావ్యాల ప్రముఖ కవి , ప్రముఖ రచయిత, పరిశోధకులు రాజమహేంద్రవరం గౌతమీ గ్రంధాలయ పూర్వ ఉన్నతోద్యోగి సన్నిధానం నరసింహ శర్మకు హైదరాబాద్ బాచుపల్లి కౌసల్య కాలనీలో ఎనభై వసంతాల సాహిత్య ముచ్చట్ల ఆనంద వేడుక ఘనంగా జరిగింది.

ప్రముఖ కవి, విమర్శకులు , సీనియర్ పాత్రికేయులు సతీష్ చందర్ అధ్యక్షతన జరిగినఈ వేడుక ప్రముఖ కవులు నామాడి శ్రీధర్ , ఒమ్మి రమేష్ బాబు పర్యవేక్షణలో అత్యంత ఆత్మీయంగా జరగడం విశేషం.

ప్రేమ, ఆప్యాయత, పరవశం , హత్తుకునే సంభాషణలు సన్నిధానం శర్మ లో ఒక ఉత్తమ సంస్కారంగా ధ్వనిస్తూ దర్శనమిస్తుందని ముక్త కంఠంతో పలువురు అభినందించడం అందరినీ ఉత్సాహపరిచింది.

సాహిత్యవేదిక, చైతన్య వేదిక, శరన్మండలి , జీవన సాహితి వంటి ఎన్నో సంస్థల ద్వారా నరసింహ శర్మ చేసిన అద్భుత కవిత్వ సాహిత్య సభల విశేషాలతో పాటు సన్నిధానం శర్మకు మధునాపంతుల , మల్లంపల్లి , ఆరుద్ర , ఆవంత్స సోమసుందర్ వంటి సాహిత్య యోధులతోనే కాకుండా ఆధునిక కవులతో ఉన్న సాహచర్యాన్ని, ఆత్మబంధాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంలో ప్రముఖ కవి, విమర్శకులు జయధీర్ తిరుమల రావు తో పాటు కొందరు కవులు రచయితలు ప్రస్తావించి జ్ఞాపకాల్ని పొంగించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ప్రముఖకవులు నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్ బాబు సంపాదకత్వంలో నరసింహ శర్మపై జీవన వైభవంలో సాహిత్య , కవిత్వ అంశాలపై రూపొందించిన ‘ సాహిత్య సంకీర్తనుడు ‘ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

జనం కోసం కవిత్వంతో పనిచేసిన గొప్ప మానవ విలువలున్న మనీషిగా బుక్ ఫెయిర్ కమిటీ చైర్మన్ , ప్రముఖ కవి యాకూబ్ , ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె . శ్రీనివాస్ , ఆచార్య అనుమాండ్ల భూమయ్య , సామల రమేష్ బాబు , సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం , కొప్పర్తి వెంకట రమణమూర్తి , సన్నిధానం శర్మ సోదరుడు, సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి , ప్రముఖ కవులు శిఖామణి, మధునాపంతుల సత్యనారాయణమూర్తి , ప్రముఖ సాహితీవేత్తలు శ్రీమతి గౌరీ చందర్ , శ్రీమతి శిలాలోలిత, శ్రీమతి సజయ కాకర్ల తదితర ప్రముఖులు పాల్గొని సన్నిధానం శర్మతో తమకున్న ముచ్చట్లను కవిత్వ గాఢతతో ఈ కార్యక్రమంలో పంచుకోవడం ప్రత్యేకాంశంగా చెప్పక తప్పదు.

కార్యక్రమం మధ్యలో ఆహూతుల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు విఖ్యాత సాహితీవేత్త , ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పూర్వ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు గురించీ , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రెండున్నర దశాబ్దాల నాడు రాజమహేంద్రవరంలో సన్నిధానం శర్మ ప్రోత్సాహంతో నిర్వహించిన మహోజ్వల సాహితీ కార్యక్రమాలగురించీ చర్చించుకోవడం కనిపించింది.

చాలాకాలం తరువాత హైదరాబాద్ లో ఒక అందమైన సాహిత్య ఉత్సవంగా జరిగిన ఈ వేడుకతో అక్కడి వాతావరణం సన్నిధానం శర్మ ఎనభై వసంతాల వేడుక గాను, ఆధునిక సంప్రదాయ కవుల కరచాలనంతో ఎన్నో ఎన్నెన్నో సాహిత్య కవిత్వ సంగతులతో అపురూప కవిత్వ స్పర్శగా ముగియడం సంతోషంగా పలువురు పేర్కొంటున్నారు.

పురాణపండ వస్తే బాగుండేదన్న కవి ప్రముఖులు
సన్నిధానం శర్మ ముచ్చట్లతో కవిత్వ ముచ్చటగా జరిగిన ఈ సభలో ప్రముఖ రచయిత పురాణపండశ్రీనివాస్ కూడా పాల్గొని ఉంటే చాలా బాగుండేదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. రెండున్నర దశాబ్దాలనాడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ గ్రంధాలయంలో ఆరెస్ సుదర్శనం , వాడ్రేవు చిన వీరభద్రుడు, సతీష్ చందర్ లతో పరమాద్భుతంగా నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ తాత్విక విశేషాల సభ వెనుక సన్నిధానం శర్మ అపూర్వ సూచనలు మరువలేనివని ఈ సందర్భంలో సతీష్ చందర్ గుర్తు చెయ్యడం విశేషం . మరొక ముఖ్యాంశమేంటే సన్నిధానం నరసింహ శర్మ ఆత్మసఖుడైన మరొక ప్రఖ్యాత కవి కొత్తపల్లి శ్రీమన్నారాయణ ను కూడా ఈ సందర్భంలో పలువురు ప్రస్తావించడం వారి స్నేహ కవిత్వాన్ని మరొకసారి పరిమళింపచేసింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x