68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. కలర్ ఫోటో సినిమా ఆహాలో నేరుగా స్ట్రీమింగ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడంతో ఆహా టీం, కలర్ ఫోటో యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీం అంతా కూడా పాల్గొంది.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమాకు అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇది కలర్ ఫోటోకు మాత్రమే కాదు.. ఇది సెలెబ్రేషన్స్ తెలుగు సినిమా. అవార్డును ప్రకటించిన తరువాత వచ్చిన కాల్స్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తున్నాను. ఇలాంటి గుర్తింపు వస్తుంటే.. దీని కోసం ఎంతైనా కష్టపడొచ్చని అనిపిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కలర్ ఫోటో 68వ సినిమాగా నిలిచింది. ఇది అందరికీ గర్వకారణం. విజ్ఞాన్ భవన్‌లో అవార్డు అందుకునే సమయంలో కలిగే ఫీలింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేషనల్ అవార్డు అనేది మన ఇంటి గోడ మీదుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. రూంలో కెమెరాలు పెట్టుకుని చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. సుహాస్, సందీప్, సాయి రాజేష్, కాళ భైరవ వంటి వారు ముందుకు వచ్చారు. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్‌తోనే టీం అంతా కలిసి పని చేయడంతోనే ఈ గుర్తింపు వచ్చింది. క్లైమాక్స్‌లో చాందినీ నటనను చూసి నా కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా స్థాయి అర్థమైంది. పదేళ్లు అయినా కూడా ఈ సినిమా టీవీల్లో వస్తే సందీప్‌కు అందరూ మెసెజ్‌లు చేస్తారు. మంచి కంటెంట్ ఇచ్చేందుకు అందరూ ప్రయత్నిస్తారు. సందీప్, సాయి రాజేష్ నెక్ట్స్ సినిమాల గురించి నేను ఎదురుచూస్తున్నాను. అల వైకుంఠపురములో సినిమాకు గానూ తమన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆహా, కలర్ ఫోటో టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు.
దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ తరువాత ఆహాలో ఈ చిత్రం విడుదలైంది. రెండేళ్లు అవుతోందని అనుకున్నాం. ఎక్కడికీ వెళ్లినా ఆ సినిమాతో మమ్మల్ని గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. థియేటర్‌లో వచ్చే కలెక్షన్లతో ఓ వ్యాల్యూ వస్తుంది.. కానీ మాది ఓటీటీలో వచ్చింది. నిజంగానే మాకు అంత రీచ్ వచ్చిందా? అనే అనుమానం ఉంది. కానీ నిజంగానే మంచి సినిమా తీశామని మాకు ఇప్పుడు అర్థమైంది. నిజాయితీతో సినిమా తీస్తే అందరూ సినిమాను ప్రేమిస్తారని అర్థమైంది. ఆటోవాలా నుంచి ఢిల్లీలో కూర్చున్న జ్యూరీ వాళ్లకు కూడా నచ్చుతుందని అర్థమైంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ అవార్డు రావడంతో మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తామ’ ని అన్నారు.
కార్తీక్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటోకు అవార్డు వచ్చిందన్న విషయం తెలియడంతో మా అందరి ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మాకున్న ఈవెంట్, మీటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. మా ఆనందాన్ని అందరితో పంచుకుందామని అనుకున్నాం. వంశీ పైడిపల్లితో మాకున్న అనుబంధంతో ఇక్కడకు వచ్చారు. ఆహా వంద శాతం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తామని మాటిచ్చాం. కలర్ ఫోటో సినిమా కంటే అచ్చమైన తెలుగు సినిమా ఉండదేమో. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని మేం చూడం. కంటెంట్ బాగుంటే దాన్ని వీలైనంతగా ప్రమోట్ చేస్తాం. ఆహాలో కలర్ ఫోటో వ్యూస్ పరంగా ఇప్పటికీ టాప్ 3లో ఉంది. అవార్డు ప్రకటించిన తరువాత మళ్లీ ఈ లెక్కలు పెరుగుతున్నాయి’ అని అన్నారు.
వాసు మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు మనమంతా ఇక్కడకు వచ్చాం. కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పేముందు ఆహా ప్రయాణం గురించి చెబుతాను. కొత్త టాలెంట్‌ను పట్టుకుని గొప్ప సినిమాలు తీయాలని అరవింద్ గారు ఆహాను ప్రారంభించారు. సాయి రాజేష్, బెన్నీ గారితో కలిసి సందీప్ రాజ్ ఓ కొత్త జర్నీ ప్రారంభించారు. ఎంతో నిజాయితీతో ఈ కథను రాశారు. విధి అన్నింటిని కలుపుతుందని అంటారు కదా. అలానే కలర్ ఫోటో, ఆహా కలిశాయి. నిర్మాతలైన సాయి రాజేష్, బెన్నీ.. దర్శకుడు సందీప్ రాజ్‌కు థ్యాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ముందు మా నిర్మాతలు సాయి రాజేష్, బెన్నీ అన్నలకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్లు నమ్మి నన్ను హీరోగా పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగింది. సాయి రాజేష్ అన్న స్టోరీ ఇచ్చి హీరోగా చేయ్ అన్నప్పుడు నాకు భయం వేసింది. మొత్తానికి చేశాం. చాలా హ్యాపీగా ఉంది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమా మేం చేస్తున్నప్పుడు మంచి కథ చెబుతున్నాం, మంచి కథలో భాగం అవుతున్నామనే ఐడియాతో ముందుకు వెళ్లాం. దానికి ఈ రోజు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. కలర్ ఫోటో సినిమాకు, ఆ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి గుర్తింపు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా జీవితంలో ఈ సినిమా, ఈ కథ ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమా ఇంత మంచి గుర్తింపు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
నటి దివ్య మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను పద్దు అనే చిన్న పాత్రను పోషించాను. సినిమా అనేది చాలా పెద్దది. టీం అంతా కలిసి కష్టపడి పని చేస్తేనే ఇలాంటి గుర్తింపు వస్తుంది. అందులో ఒక డిపార్ట్మెంట్ అయిన యాక్టింగ్‌లో నాది ఒక పార్ట్. ఈ అవార్డు రావడంతో నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. టీం అంతా కలిసి కష్టపడితే ఇలాంటి అవార్డులు వస్తాయని చెప్పడానికి కలర్ ఫోటో ఒక ఉదాహరణ. ప్రతీ సినిమాకు అందరూ కష్టపడి చేస్తారు. అయితే ఈ సినిమాకు అందరూ ఎంతో ఇష్టపడుతూ కష్టపడ్డారు’ అని అన్నారు.
కమెడియన్ హర్ష మాట్లాడుతూ.. ‘మొదటి రోజు నుంచే ఈ సినిమా కోసం అందరూ ఎంతో నిజాయితీగా పని చేశారు. అవార్డులు అనేవి చేసిన పనికి గుర్తింపులాంటివి. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. సందీప్ ఇంకా ఏం చేస్తారో చూడాలి. మీడియా కూడా ఈ సినిమాను ప్రోత్సహించింది. ఆహా వల్ల ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరకు నేరుగా వెళ్లింది’ అని అన్నారు.
దర్శక నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రశాంతంగా జరిగిందని అంతా అనుకుంటారు. కానీ దాని వెనకాల ముగ్గురున్నారు. నా మొదటి చిత్రం ఏడాదిన్నర, రెండేళ్లు తీశాను. రెండో సినిమా ఐదేళ్లు తీశాను. మూడో సినిమా 38 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ఆరు నెలల్లో విడుదల చేశాను. దీనికి కారణం ముగ్గురు వ్యక్తులు. అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్ వల్లే ఈ సినిమా ఎంతో సులభంగా పూర్తయింది. ఒక్క రోజు కూడా డబ్బు వల్ల ఆలస్యం కాలేదు. సినిమా అయిపోయిన వెంటనే ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. ఒక వేళ నేను ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఈ రేంజ్ రీచ్ వచ్చేది కాదు. ఈ రేంజ్ సక్సెస్ వచ్చేది కాదు. చిన్న సినిమాను థియేటర్‌లో పుష్ చేయడం అంత సులభం కాదు. విపరీతంగా సినిమాకు పబ్లిసిటీ చేసి ఈ రేంజ్ తీసుకొచ్చింది ఆహా టీం. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియెన్ వంశీ పైడిపల్లి. ఫస్ట్ కట్ చేశాక నేను భయపడ్డాను. ఇది కచ్చితంగా ఆహా వాళ్లకు చూపించకూడదని అనుకున్నాను. దాచి పెట్టి ఎన్నో రిపేర్లు చేశాను. ఆ తరువాత ఒక రోజు వంశీ పైడిపల్లి గారికి చూపించాను. ఆ రోజు వంశీ గారు, రామ్ గారు ఇచ్చిన హగ్‌తో హిట్ కొట్టేశామని అనిపించింది. నాకు ఇంత హెల్ప్ చేసి, ఇంత రీచ్ ఇస్తున్న అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్, ఆహా టీంకు థ్యాంక్స్. ఒక చిన్న సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో పెద్దవాళ్లంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు’ అని అన్నారు.
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమాను అభినందించడానికి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన వంశీ పైడిపల్లి గారికి థ్యాంక్స్. సాయి రాజేష్ గారు నాకు రెండు దశాబ్దాలుగా ప్రాణ స్నేహితుడు. సందీప్ రాజ్ దశాబ్దకాలం నుంచి స్నేహితుడు. వారిద్దరూ బెన్నీతో కలిసి చేసిన చిత్రం కలర్ ఫోటో. ఈ కలర్ ఫోటో సినిమా తెలుగు ఓటీటీ రంగానికి ఓ కలర్ తీసుకొచ్చింది. ఓటీటీ అంటే రీచ్ ఉంటుందా? అనే అనుమానాలు ఉండేవి. కలర్ ఫోటో అనేది ఫస్ట్ తెలుగు ఓటీటీ బ్లాక్ బస్టర్. నిర్మాతల అంచనాలు మారిపోయాయి. ప్రేక్షకులు ఆదరించడంతో అందరికీ ఊతమిచ్చినట్టు అనిపించింది. ఇది ఎంతో నిజాయితీతో తీసిన చిత్రం. వీరంతా ఇప్పుడు చిన్న వ్యక్తులు కాదు. ఈ అవార్డుతో వారంతా గొప్ప వ్యక్తులు అయ్యారు. సందీప్, రాజేష్, ఆహా టీం ఇలా అందరికీ ఉమ్మడి విజయం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంటింటికి వినోదాన్ని అందిస్తున్న ఆహా నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.