మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. ఇలాంటి కథలకి మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవచ్చు. ఇలాంటి కథలను కొత్త దర్శకులు ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఫోకస్ చిత్రం కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే తెరకెక్కింది. ఇందులో యంగ్ హీరో విజయ్ శంకర్, బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి జి.సూర్యతేజ దర్శకుడు. వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: ఎస్పీ వివేక్ వర్మ (భానుచందర్), న్యాయమూర్తి ప్రమోద దేవి (సుహాసిని మణిరత్నం) అనోన్య దంపతులు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో వివేక్ వర్మ దారుణ హత్యకు గురవుతాడు. అనుమానాస్పద రీతిలో మరణించడంతో ఎస్సై విజయ్ శంకర్ (విజయ్ శంకర్) దర్యాప్తు చేపడుతాడు. అనేక మలుపు తిరుగుతున్న వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తును టేకప్ చేయడానికి ప్రేమ (అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. వివేక్ వర్మ ఎలా హత్యకు గురయ్యాడు. హత్య కేసు తర్వాత ప్రమోదా దేవి పరిస్థితి ఏమిటి? వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్‌గా మారింది? దర్యాప్తులో ఎస్సై విజయ్ శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విజయ్ శంకర్‌ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు వివేక్ వర్మను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే ప్రశ్నలకు సమాధానమే ఫోకస్ సినిమా కథ.
కథ కథనం విశ్లేషణ: ఎలాంటి సాగదీత లేకుండా నేరుగా ఫోకస్ సినిమా కథలోకి దర్శకుడు సూర్యతేజ చకచకా తీసుకెళ్లాడు. అయితే ఫస్టాఫ్‌లోప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా రకరకాల ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లాడు. బలమైన సన్నివేశాలు లేకపోవడం, పేలవంగా కథనం సాగడం.. క్యారెక్టర్లలో క్లారిటీ లేకపోవడం లాంటి అంశాలు తొలి భాగంలో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక ఫోకస్ సినిమా రెండో భాగంలో దర్శకుడు సూర్యతేజ సరైన గాడిలో పడి.. సినిమాను మంచి కథనం, ట్విస్టులతో కథను పరుగులు పెట్టించాడు. ప్రీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టుతో కథను మరింత ఆసక్తికరంగా మలిచాడు. సుహాసిని మణిరత్నం, భాను చందర్ పాత్రలను భావోద్వేగంగా మార్చి ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. దర్శకుడు సూర్యతేజ కొత్తవాడైనా గానీ కథను బాగా డీల్ చేసేందుకు ప్రయత్నించాడనిపిస్తుంది. అక్కడక్కడ స్క్రిప్టు పరంగా తడబాటు తప్ప మిగితాదంతా ఒకే అనిపించాడు.
ఫోకస్ సినిమాలో ఎస్సైగా నటించిన విజయ్ శంకర్ సినిమా భారాన్నంత ఒక్కడే మోసే ప్రయత్నం బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్లలో మంచి నటనను కనబరిచాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అషురెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అతిథి పాత్రకే పరిమితమైంది. ఫోకస్ సినిమాకు సుహాసిని మణిరత్నం ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. భానుచందర్‌తో సుహాసిని చేసిన సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నాయి. చివర్లో సుహాసిని నటన సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రభాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పలు సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. వినోద్ అందించిన బీజీఎం బాగుంది. సత్య ఎడిటింగ్ విషయానికి ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేసి… సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు మూడు ట్విస్టులను ఫస్ట్ లో కూడా జత చేసుంటే… సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగా ఉండేది. రిలాక్స్ మూవీ మేకర్స్, స్కైరా క్రియేషన్స్‌పై వీరభద్రరావు పరిస నిర్మాణ విలువలు బాగున్నాయి. మర్డరీ మిస్టరీతో న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఫోకస్ సినిమా రూపొందింది. సుహాసిని, భానుచందర్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. ఈ మర్డర్ మిస్టరీ మరింత ఆసక్తి కరంగా ఉండేది. క్రైమ్, మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ అంశాలను నచ్చే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్
రేటింగ్: 3