అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠమనేని హీరోగా భద్రాద్రి, కత్తి చిత్రాల దర్శకుడు మల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మధురపూడి గ్రామం అనే నేను. క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ:
మధురపూడి గ్రామంలోనే ఈ కథ అంతా సాగుతుంది. ఆ ఊరే తన ఆత్మకథ చెప్పుకున్నట్టుగా ఆ కోణంలోనే కథ జరుగుతుంది. ఊర్లో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వరకైన నిలబడతాడు. తన ఫ్రెండ్ మంచి కోసం ప్రాణాలిచ్చేందుకైనా, తీసేందుకైనా ఏమాత్రం వెనకాడని మనస్తత్వం. ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు, ధుర్యోదనుడు లాంటి క్యారెక్టర్స్. తన స్నేహితుడి కోసం ప్రాణాలైన ఇవ్వగలిగే సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథలిన్ గౌడ) ఎలా వస్తుంది? ఆమె వచ్చాక సూరి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? చివరకు బాబ్జీ సూరి స్నేహబంధం ఎలా మలుపు తిరిగింది? ఊర్లోని రాజకీయాల్లో సూరి పాత్ర ఏంటి? అసలు ఈ కథకు 700 కోట్ల రూపాయల డిజిటల్ స్కామ్‌కు సంబంధం ఏంటి అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
ఇది రెగ్యులర్ హీరోలు చేయగలిగే క్యారెక్టర్ కాదు..కచ్చితంగా ఇలాంటి కథలు కొత్త నటీనటులు చేస్తేనే ఆ మూడ్ క్యారీ అవుతుంది. ఈ కథకి తగ్గట్టుగా సూరి పాత్రలో శివ కంఠమనేని చక్కగా నటించాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో పాటుగా యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. రెగ్యులర్ హీరో వేసే పాత్రలా కాకుండా.. కాస్త కొత్తగా ఉన్నా సూరి కారెక్టర్‌కు శివ కంఠమనేని పర్‌ఫెక్ట్ యాప్ట్ అనేలా నటించారు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ తన వయసుకి మించిన పాత్ర చేసినా లుక్స్ పరంగా ఆకట్టుకుంది. తనకి చివరి 30 నిమిషాలు నటనకి మంచి స్కోప్ దక్కింది. కథలో కీలకమైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు కూడా బాగుంది. భరణిశంకర్ తన పరిదిలో నటించి తన పాత్రకు న్యాయం చేశారు. వనితా రెడ్డి, జబర్‌దస్త్ నూకరాజు, మహేంద్రన్ వారి వారి పరిది మేర నటించారు.
విశ్లేషణ…
ఓ కథలో రివేంజ్, పొలిటికల్, లవ్, యాక్షన్ డ్రామాను యాడ్ చేయడం.. కమర్షియల్‌గా అన్ని అంశాలను కలగలపి తీయడం మామూలు విషయం కాదు. అన్ని అంశాలను జోడిస్తూనే సమాజానికి ఏదైనా సందేశాన్ని ఇవ్వడం మరింత కష్టం. కానీ ఈ చిత్రంతో దర్శకుడు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. అన్ని కారెక్టర్లను అద్భుతంగా మలిచిన తీరు ప్రశంసనీయం. క్యారెక్టర్స్ రిజిస్టర్ అవ్వడానికి కాస్త టైమ్ పట్టడంతో ప్రథమార్ధం నిదానంగా సాగినట్టు అనిపించినా.. మణిశర్మ సంగీతం ఆ లోటుకి తీర్చుతుంది. ముఖ్యంగా ఎల్లే గోరింక పాట ఫస్టాఫ్‌లో హైలైట్ కాగా లింగా లింగా పాట సెకండాఫ్‌ని నడిపిస్తుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో హీరో పర్ఫామెన్స్, దర్శకుడు తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా దర్శకుడు చేయడంలో సక్సెస్ అయ్యారు.
టెక్నికల్‌గా మధురపూడి గ్రామం అనే నేను అందరినీ ఆకట్టుకుంటుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సురేష్ భార్గవ్ విజువల్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. పల్లెటూరి విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. తక్కువ నిడివితో ప్రేక్షకుడ్ని బోర్ కొట్టించకుండా చక్కగా కత్తిరించాడు ఎడిటర్ గౌతంరాజు గారు. ఇక నిర్మాతలు కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి.
చివరగా: మధురపూడిగ్రామం అనే నేను..ఒక స్వచ్చమైన ఊరికథ
రేటింగ్ః 3/5