Friday, November 1, 2024

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ‘మంగళవారం’

న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. ఇవాళ మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి అని రివీల్ చేశారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రియదర్శికి ఉన్న మాస్క్ విశ్వక్ సేన్ తీశారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ ”హీరోయిన్‌ను హీరో చేస్తాడు. రోల్ ఇచ్చి మాస్క్ వేస్తాడు కానీ ముఖం చూపించడు. దర్శకుడ్ని ఐటెం డ్యాన్సర్ చేస్తాడు. నెక్స్ట్ నేను సినిమా చేస్తే అజయ్ భూపతి నన్ను ఏం చేస్తాడో!? జోక్స్ పక్కన పెడితే… అజయ్ భూపతి రెండు రోజులు ముందు ఫోన్ చేస్తే ఫోటోలు పంపించేవాడిని. అప్పటికి తరుణ్ భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆయన కథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. డేట్స్ కుదరక అప్పుడు చేయలేదు. లుంగీ కట్టుకుని, కత్తి పట్టుకునే సోకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో తీరుతుంది. అజయ్ భూపతి నాతో సినిమా చేస్తే మళ్ళీ లుంగీ కట్టుకుని కత్తి పట్టుకోవాలని ఉంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ఇప్పుడీ ‘మంగళవారం’… ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయతీగా చెప్పే దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్. త్వరలో సినిమా చేద్దాం! పాయల్ బాగా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను ఇంత క్వాలిటీగా తీయాలంటే నిర్మాతలు దొరకడం తక్కువ. నిర్మాతలకు హ్యాట్సాఫ్. ప్రియదర్శి ఏం నక్క తోక తొక్కాడో తెలియదు. సాధారణంగా మంచి సినిమాలు చేస్తే… పేరు వస్తే పైసల్ రావు, పైసల్ వస్తే పేరు రాదు. ప్రియదర్శి చేసే సినిమాలకు పేరు, పైసల్ వస్తున్నాయి. ‘బ్యాట్ మ్యాన్’, ‘డంకర్క్’ సినిమాల్లో టామ్ హార్డీ ఎక్కువ మాస్క్ తో కనిపిస్తారు. తెలుగులో నేను ఆ టైపు రోల్ చేశానని ప్రియదర్శి చెప్పుకోవచ్చు. టీమ్ అందరికీ క్రాంగ్రాచ్యులేషన్స్” అని అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ ”థియేటర్లలో చాలా మంది చూశారు. తర్వాత చాలా మంది మాట్లాడారు. ట్విస్ట్ రివీల్ చేయవద్దని ప్రీ రిలీజ్ వేడుకలో అజయ్ భూపతి అన్న రిక్వెస్ట్ చేశారు. మీడియా ట్విస్ట్ రివీల్ చేయలేదు. అందుకు థాంక్స్. నాకు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు లేదు. అజయ్ అన్న కథ చెబుతున్నప్పుడు పులి క్యారెక్టర్ నేనే చేస్తున్నానేమో అనుకున్నా. నాకు ఆ క్యారెక్టర్ అంత నచ్చింది. కథలోకి వెళ్లిన తర్వాత ఫోటోగ్రాఫర్ వాసు క్యారెక్టర్ బాగా నచ్చింది. అది చేయాలని అనిపించింది. కానీ, అజయ్ అన్న మాలచ్చమ్మ చేయాలని అడిగారు. ఆ పేరు వినగానే నచ్చింది. పాయల్ కంటే ముందు ఎంత మందిని ఆడిషన్స్ చేశారో నాకు తెలుసు. ఆవిడ వచ్చిన తర్వాత అజయ్ భూపతిలో నవ్వు కనిపించింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అద్భుతంగా పని చేశారు. ప్రియదర్శి సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో… ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక ‘మంగళవారం’ మార్చింది. ఇది నా జీవితంలో గుర్తుపెట్టుకుని ‘మంగళవారం’ ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా” అని అన్నారు.

అజయ్ భూపతి మాట్లాడుతూ ”నేను ‘ఆర్ఎక్స్ 100’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న సమయంలో మా బాస్ ఆర్జీవీ గారు ఒక హీరో కావాలని కొన్ని ఫీచర్స్ చెప్పారు. అప్పుడు విశ్వక్ సేన్ గోడమీద కూర్చున్న ‘వెళ్ళిపోమాకే’ స్టిల్ చూశా. తర్వాత లక్ష్మణ్ దగ్గర నంబర్ తీసుకుని ఫోన్ చేసి కొన్ని ఫోటోలు తీసుకున్నా. అప్పటి నుంచి విశ్వక్ సేన్ అంటే తెలుసు. ఇప్పుడు తను మాస్ కా దాస్. మా ఇద్దరి మెంటాలిటీలు ఒక్కటే. అందుకని, అతను అంటే ఎక్కువ ఇష్టం. పిలిచిన వెంటనే వచ్చిన ఆయనకు థాంక్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన వచ్చారు. లేడీస్ చాలా మంది సినిమా గురించి ఆర్టికల్స్ రాస్తూ సోషల్ మీడియాలో నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఎవరూ ట్రై చేయనిది చేశానని, టేకింగ్ నెక్స్ట్ లెవల్ అని చెబుతున్నారు. హ్యాపీ! అన్నిటికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏమిటంటే… పాయల్ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా? అని మొదట్లో కొంచెం భయపడ్డా. అయితే ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చాలా అప్డేట్ అయ్యి ఉన్నారని మరొక్కసారి నిరూపితం అయ్యింది. పాయల్ క్యారెక్టర్ డీల్ చేసిన విధానం, పాయల్ నటన, నేపథ్య సంగీతం బావుందని అంటున్నారు. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా ‘మంగళవారం’ అని చెబుతున్నారు. ఇది నిజంగా హ్యాపీగా ఉంది. నాకు హెల్ప్ చేసిన టెక్నీషియన్లు అందరికీ థాంక్స్. సినిమాలో రాసిన క్యారెక్టర్లు అన్నిటి కంటే ప్రియదర్శి చేసిన మాలచ్చిమి క్యారెక్టర్ నాకు ఇష్టం. ప్రతి ఆర్టిస్ట్ తెరపై తన ఫేస్ కనిపించాలని కోరుకుంటారు. ప్రియదర్శి చేసిన క్యారెక్టర్ 80 శాతం ఫేస్ కనిపించదు. కానీ, ఆ పాత్రలో గాఢత అర్థం చేసుకుని ప్రియదర్శి చేశాడు. అతనికి థాంక్స్. పాయల్ చేసిన క్యారెక్టర్ మరొక హీరోయిన్ చేయలేదని చెబుతున్నారు. గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరని కూడా చెబుతున్నారు. ఆర్టిస్టులు అందరికీ థాంక్స్. మా నిర్మాతలు స్వాతి గారు, సురేష్ వర్మ గారు లేకపోతే నేను ఇంత క్వాలిటీ సినిమా చేసేవాడిని కాదు. ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో శంకర్ అండ్ నవీన్ గారు మంచి రిలీజ్ చేశారు. నైజాం దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేశారు” అని అన్నారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ ”నిర్మాత స్వాతి గారికి కంగ్రాట్స్. ఎటువంటి స్టార్స్ లేకుండా కథపై నమ్మకంతో ఇంత భారీ ఎత్తున సినిమా నిర్మించిన స్వాతి, సురేష్ వర్మకు కంగ్రాట్స్. టాలెంట్ ఉన్న దర్శకులు వస్తే కొత్త యాక్టర్లు, టెక్నీషియన్లు వస్తారు. తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’, అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’తో అలా జరిగింది. ‘మంగళవారం’ చిత్రానికి వెళితే పల్లెటూరికి వెళ్లినట్టు ఉంటుంది. స్టార్స్ లేకుండా సినిమా చేయడం అంటే ప్రతి క్షణం అదొక యజ్ఞమే. ఆ యజ్ఞం చేయాలంటే దర్శకుడికి తనపై తనకు నమ్మకం ఉండాలి. అటువంటి యజ్ఞం చేసి విజయం అందుకున్న అజయ్ భూపతికి కంగ్రాట్స్. ఈ సినిమాలో సస్పెన్స్ ఎవరికీ చెప్పవద్దని అంటున్నారు. ‘అవే కళ్ళు’, ‘అన్వేషణ’ సినిమాల్లో ట్విస్ట్ తెలిసినా మళ్ళీ మళ్ళీ చూశా. ‘మంగళవారం’ క్లైమాక్స్, ట్విస్ట్ తెలిసినా మళ్ళీ మళ్ళీ చూస్తాం. సినిమాలో ఎంటరైన పది నిమిషాలకు మళ్ళీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోసారి ఆ థ్రిల్, టెన్షన్ ఫీల్ అవుతాం. హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్ సినిమాలు యునీక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఇటువంటి సినిమాలకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాలి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాగా చెప్పారు. మనం అంతా మాట్లాడుకున్నాం. చిన్నారులపై కొందరు సరదాగా చేసే వెధవ పనులు ఎంత ఎఫెక్ట్ చేస్తాయనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా మంది మగవాళ్ళు ఈ సినిమా చూడాలి. అజయ్ భూపతి ఇటువంటి సినిమాలు చేస్తూ ఉండాలి. కొన్ని రోజులు పొతే ఇటువంటి సినిమాలు క్లాసిక్స్ అవుతాయి. ఇందులో క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. పాయల్ అద్భుతంగా నటించారు” అని చెప్పారు.

సిరాశ్రీ మాట్లాడుతూ ”ఈ సినిమాలో అజనీష్ నేపథ్య సంగీతం విని గుండెల్లో వైబ్రేషన్స్ కలిగాయనేది వాస్తవం. సినిమా చూసిన కొందరు నాకు ఫోనులు చేసి ఆర్టిస్టుల పేర్లు అడిగారు. పాయల్ నటనకు అవార్డు వస్తుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ”తరుణ్ జీ మా సినిమాలో మీరు  ఓ క్యామియో చేయాలని అజయ్ భూపతి భయ్యా నుంచి ఫోన్ వచ్చింది. ఓకే అన్నాను. తర్వాత ప్రియదర్శి ఫోన్ చేసి నువ్వు తప్పకుండా చేయాలన్నాడు. షూటింగుకు వెళితే ‘అప్పడప్పడ తాండ్ర’ పాటకు డ్యాన్స్ చేయాలన్నారు. నేను మా ఫ్రెండ్ సంగీత్ ఫంక్షన్లో కూడా డ్యాన్స్ చేయలేదు. సినిమాలో ఎట్లా? అంటే… రాజమండ్రి దగ్గర ఊరిలోని వీధుల్లో మిట్ట మధ్యాహ్నం డ్యాన్స్ చేయించారు. చివరకు, సినిమాలో ఉండటం లేదన్నారు. నేను అయితే బాగా ఎంజాయ్ చేశా. ‘ఆర్ఎక్స్ 100’ చూసి టీం అందరినీ అప్రిషియేట్ చేశా. అజయ్ భూపతి మంచి ఫ్రెండ్. ఆయనకు గట్స్  ఉన్నాయి. మనసులో ఒక్క ఎటువంటి చెడు ఆలోచన ఉండదు. క్లీన్ హార్టెడ్ పర్సన్. ఎంత నిజాయతీతో ఆయన సినిమా తీశాడో చూశారు. ఆయనతో కొన్ని విషయాలు డిస్కస్ చేసిన తర్వాత, కన్వర్జేషన్స్ తర్వాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. నా చెక్ లిస్టులో మంచి పాటకు డ్యాన్స్ చేయాలనేది ఈ సినిమాతో తీరింది. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి చేసిన సినిమా ఇది. థియేటర్లలో చూడండి” అని అన్నారు.

సురేష్ వర్మ మాట్లాడుతూ ”నేను, స్వాతి సినిమా చేయాలని అనుకున్నప్పుడు… మా తమ్ముడు అజయ్ భూపతి కథ చెప్పాడు. ‘మంగళవారం’ పోస్టర్ విడుదల చేద్దామని అజయ్ అన్నాడు. అప్పటి నుంచి ఈ సక్సెస్ మీట్ వరకు వచ్చాం. మా సంస్థలో మొదటి సినిమాగా ‘మంగళవారం’ చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయం అందించిన ప్రేక్షకులకు పాదాభివందనం. తరుణ్ భాస్కర్ చెప్పినట్లు అజయ్ భూపతి గట్స్, హానెస్ట్ ఉన్న పర్సన్. వాటితో పాటు కన్విక్షన్ కూడా ఉంది. తను పడ్డ కష్టానికి ఈ రెస్పాన్స్ చూసి మాకు హ్యాపీగా ఉంది. తరుణ్ భాస్కర్ పెద్ద దర్శకుడు అయినా అజయ్ అడిగిన వెంటనే సాంగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. ప్రియదర్శి కూడా గట్స్ ఉన్న వ్యక్తి. మంచి క్యారెక్టర్ చేశారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో విశ్వక్ సేన్ దూసుకు వెళుతున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఆయనకు థాంక్స్. అందరు చెబుతున్నట్లు పాయల్ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా. అజయ్ భూపతి దర్శకుడు మాత్రమే కాదు… నా బ్రదర్ కూడా! ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎంత తపన పడ్డాడో, ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. దర్శకత్వంతో పాటు చాలా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమాను పెద్ద సినిమాలతో కంపేర్ చేయడం మాకు సంతోషంగా ఉంది” అని అన్నారు.

‘మంగళవారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ పాయల్, నటులు రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, కార్తీక్, లక్ష్మణ్, గేయ రచయిత గణేష్ తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x