తనిష్క్ రెడ్డి సమర్పిస్తోన్న ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెం.1’ చిత్రం ప్రారంభం
తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెంకట్ యాదవ్(ప్రవీణ్ యాదవ్) తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, జ్యోత్స్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్‌లో ఉండడం వలన నేను తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ఎగ్జిక్యూట్ చేయవలసి వచ్చింది. నన్ను హీరోని చేసిన వెంకట్ గారికి, మరియు నిర్మాతలకు ధన్యవాదాలు. మా చిత్ర దర్శకుడు మాధవ్ మూర్తి ‘జెర్సీ, మళ్ళీ రావా’ వంటి సినిమాలకు వర్క్ చేసి ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నాడు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు మాధవ్ మూర్తి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంతకు ముందు ‘జెర్సీ, మళ్ళీ రావా’ వంటి సినిమాలకు అసోసియేట్‌గా వర్క్ చేశాను. ఈ చిత్రంలో నాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు చిత్ర నిర్మాతలు రిచా భట్నాగర్, విజయ లక్ష్మీగారు. వారికి నా ధన్యవాదాలు. నాకు, హీరోకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. మేము ఎప్పటి నుండో సినిమా తీయాలనుకుంటున్నాము. ఈరోజుకి ఆ కల సాకారమైంది. చిత్ర కథ విషయానికి వస్తే యధార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. ఎమోషన్, యాక్షన్ వంటి స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్ చివరి వారం మొదలు పెట్టనున్నాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాము..’’ అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంది.. అందుకే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాను. కథకు తగ్గట్టుగా పాటలు చాలా బాగుంటాయి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాకు సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.
చిత్ర హీరోయిన్ అంకిత సాహు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.
తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి
సమర్పణ: తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్
బ్యానర్: ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ ముమ్మలనేని
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
నిర్మాతలు: రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ
కథ, కథనం, దర్శకత్వం: మాధవ్ మూర్తి