ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్ గా తెలుసుకుంటున్నాను” అంటున్నాడు వర్ధమాన యువ కథానాయకుడు మణి సాయి తేజ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన మణి సాయి తేజ… యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ బాటలో రెండు పదులు నిండకుండానే.. నూనుగు మీసాల వయసులో “బ్యాట్ లవర్స్” చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే “ఎవడీ బుడ్డోడు?” అనిపించుకున్న ఈ చిచ్చర పిడుగు… వెంటనే “రుద్రాక్షాపురం” చిత్రంలో హీరోగా నటించే అవకాశం సొంతం చేసుకుని మరింతగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు!!
కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన “మెకానిక్” త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేశావే పిల్ల నచ్చేశావే” పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణి సాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. క్రేజీ కుర్ర హీరోల జాబితాలో తన పేరు కూడా చేరేందుకు అవసరమైన లుక్స్, హార్డ్ వర్కింగ్ నేచర్ పుష్కలంగా కలిగిన మణి… పోరాటాలు, నృత్యాలు వంటి విభాగాల్లో తనను తాను మరింతగా మలుచుకుంటూ… సినిమానే శ్వాసగా, సినిమానే ధ్యాసగా ముందుకు సాగుతున్నాడు!!
తను నటించే ప్రతి సినిమా తనకొక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లా భావిస్తూ… అందులో నటించే సీనియర్స్ అందరూ తనకు ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ.. నటనలో పాఠాలు నేర్చుకుంటూ, నటుడిగా పరిణితి చెందుతున్న సాయితేజ… తన మూడవ చిత్రం “మెకానిక్” తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించిందనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. తాను హీరో కావడం కోసం… తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తున్న తన తల్లిదండ్రులు తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని ఒకింత భావోద్వేగానికి లోనవుతూ చెబుతున్న మణి సాయి తేజ తన గమ్యసాధనలో కృతకృత్యుడు కావాలని మనసారా కోరుకుందాం!!