గతేడాది ప్రారంభం నుంచి కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలకు గుండెకు కూడు పట్టని పరిస్థితి నెలకొంది. ఒకపక్క వ్యాక్సినేషన్‌లో అనేక దేశాలు దూసుకెళ్తున్నా.. కోవిడ్ వ్యాప్తి మాత్రం ఆడగం లేదు. కొత్త కొత్త వేరియంట్లు దాడి చేస్తూ ప్రపంచంలోని అనేక దేశాలను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ప్రధానంగా ఈ మధ్య విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ అనేక దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. తాజాగా తాజాగా ఇరాన్.. ఈ వేరియంట్‌కు బలవుతోంది. డెల్టా వేరియంట్ కేసులు ఇటీవలి కాలంలో ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఇరాన్, దాదాపు అన్ని నగరాల్లో మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్‌లో ఐదో వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కఠినమైనా నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని ఆ దేశం భావిస్తోంది.
ఇరాన్‌లో ఇప్పటే ఏడాదిలో 4 సార్లు కరోనా వైరస్ విజృంభించింది. దీంతో ఇరాన్.. అటు ఆర్థికంగా, ఇటు ప్రాణాల పరంగా తీవ్ర నష్టాన్ని చవి చూసింది. ఇప్పటివరకూ అక్కడ 32లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. దాదాపు 85వేల మంది మరణించారు. ఈ మధ్య కాలంలో వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గడంతో ప్రభుత్వం కొద్దిగా ఆంక్షలను సడలించింది. కానీ వెంటనే డెల్టా వేరియంట్ కేసులు బయటపడడంతో మళ్లీ ఆంక్షలు కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.
రెండు వారాల సమయంలో ఇరాన్‌లో డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య భారీగా పెరగింది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని.. మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో 5వ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దానిని ఎదుర్కొనేందుకే ఆంక్షలు మళ్లీ కఠినం చేశామని చెప్పారు. కాగా.. ఇరాన్ విధించిన నిబంధనల ప్రకారం.. నగరాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. దాదాపు 275 పట్టణాల్లో అత్యవసరం కాని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను మూసివేసింది. మాల్స్, పార్కులు, రెస్టారెంట్లు, సెలూన్లు, బుక్‌స్టోర్లను రెడ్ జోన్లుగా ప్రకటించింది.
ఇరాన్ జనాభా దాదాపు 8.4కోట్లు. అలాంటి ఇరాన్‌లో ఇప్పటికే 4సార్లు కోవిడ్ వేవ్ విజృంభించింది. అయినా అక్కడ వ్యాక్సినేషన్ స్థాయి మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటివరకు అక్కడ కేవలం 63లక్షల డోసులను అందించినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలింపింది. అంటే అక్కడి జనాభాతో పోల్చితే 2శాతం కంటే తక్కువ మంది మాత్రమే రెండు డోసుల తీసుకున్నారన్నమాట.
ఇరాన్‌లో ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్, రష్యాకు చెందిన స్పుత్నిక్‌లను దిగుమతి సాగుతోంది. అంతేకాకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిరాన్ బరాకత్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతులిచ్చింది.