గతేడాది కరోనా సమయంలో రాష్ట్ర సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ నేడు(శుక్రవారం) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారని ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా.. గతేడాది కరోనా సమయంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సుధాకర్‌ను రాష్ట్ర సర్కార్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన విశాఖలో రోడ్డుమీద నిరసనకు దిగారు. శరీరం మీద చొక్కా లేకుండా ధర్నాకు దిగారు. నెల రోజుల క్రితం ఆరోగ్యంగా కనిపించిన డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం గుండుతో ఉన్నారు. కనుబొమలు కూడా లేవు.
ఈ క్రమంలోనే రోడ్డు మీద వెళ్లే వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ అక్కడి ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో సివిల్ పోలీసులు వెళ్లి ఆయనను చేతులు వెనక్కి కట్టి రోడ్డుపై పడుకోబెట్టారు. అనంతరం విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అనంతరం కౌన్సెలింగ్ అందించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సీబీఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సమీకరించింది.
ఇదిలా ఉంటే కేసు విచారణ తర్వాత వదిలివేయడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. సరిగ్గా ఏడాది గడిచేసరికి ఇప్పుడు సుధాకర్ చనిపోవడం వారి కుటుంబంలో తీవ్ర ఆవేదన కలిగించింది. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు సుధాకర్ మృతికి వైసీపీ, ముఖ్యమంత్రి జగన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.