2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వివిధ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి పేర్లన్నీ మోదీనే ఎందుకావుతాయో అంటూ వ్యాఖ్యానించారు.
‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ… వీళ్ళందరి ఇంటి పేర్లలో ‘మోదీ’ ఎలా ఉందబ్బా? ఈ దొంగలందరి ఇంటి పేరు ఒకే విధంగా ‘మోదీ’నే ఎందుకో?’’ అని రాహుల్ అన్నారు. దీనిపై అప్పట్లో బీజేపీ నేతలు, మోదీ అనే పేరున్న పలువురు వ్యక్తులు తీవ్ర ఆరోగ్యం వ్యక్తం చేశారు.
ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో పూర్ణేష్ మోదీ.. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు.
మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారినందరినీ రాహుల్ గాంధీ అవమానించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో 2019 అక్టోబరులో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు.
తాను తప్పు చేయలేదని కోర్టుకు తెలిపారు. అయితే తదుపరి విచారణను కోర్టు జూన్ 24న వాయిదా వేసింది.
ఆ తీర్పు ప్రకారం.. గురువారం కోర్టులో విచారణ జరిగింది. అందులో భాగంగా.. రాహుల్ గాంధీ గురువారం కోర్టుకు హాజరయ్యారు.
తాను ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో కేవలం వ్యంగ్యంగా మాట్లాడానని తెలిపారు. దీని గురించి తనకు ఇంత కన్నా ఎక్కువగా జ్ఞాపకం లేదని, దీనిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు.