దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలంతా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అయితే కరోనాతో పోరాటంలో కీలక పాత్ర పోషించే వ్యాక్సిన్ల కొరన ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి టీకా గురించి వివరించారు. టీకా కొరతను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.
దేశీయంగా టీకాల ఉత్పత్తి వేగం పెంచేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నామని, అలాగే విదేశీ టీకా సంస్థలను కూడా అనుమతిస్తున్నామని తెలిపారు. టీకాలు అందక ప్రజల్లో పెరిగిన భయాందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వం రాత్రింబవళ్ళు శ్రమిస్తోందని, సరఫరాను గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మోదీ వెల్లడించారు. వ్యాక్సిన్ కొరతను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని విదేశీ వ్యాక్సిన్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, దానికి తోడు డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో వివిధ జిల్లా అధికారులతో వర్చువల్‌గా ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అందులో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కీలక అంశాలను చర్చించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం చేపట్టిన కొత్త ప్రణాళికలో భాగంగా వ్యాక్సిన్‌ను షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగానే ప్రతి రాష్ట్రానికి సరఫరా చేస్తామని, ఆ షెడ్యూల్‌కి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు చేసుకోవాలని మోదీ సూచించారు.