కరోనా నేపథ్యంలో ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్న ప్రభుత్వాలు, నేతలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ నేతలు దారుణంగా ఔషధాలను దాచడం అమానుషమని పేర్కొంది. అందులో భాగంగానే దేశంలో కరోనా ఔషధాల కొరతపై ఢిల్లీ పోలీసులు సమర్పించిన నివేదికను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దేశంలో ఔషధాలు తీవ్ర కొరత ఉన్నా కూడా కొందరు రాజకీయ నాయకులు వాటిని నిల్వ చేయడంపై హైకోర్టు మండి పడింది. ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు నిల్వ చేసిన ఔషధాలను డీజీఎచ్ఎస్(డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీస్)కు అప్పగించాలని తెలిపింది. అంతేకాకుండా ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నివేదిక సరిలేదని, నివేదిక అస్పష్టంగా, కప్పిపుచ్చే విధంగా ఉందని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది.
లోక్ సభ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ మాజీ ఎమ్మల్యే ముఖేశ్ శర్మ, భాజాపా అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా, ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే తదితరులను ప్రశ్చించామని ఢిల్లీ పోలీసులు తమ నివేదికలో తెలిపారు. అంతేకాకుండా వారంతా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసే ఉద్దేశ్యంతోనే ఔషధాలు, ఆక్సిజన్, వైద్య పరికరాలను సేకరించారని పోలీసులు తెలిపారు. తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో 6 వారాల గడువు ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే పోలీసులు కోరిన గడువుపై కోర్టు ఆగ్రహించింది. గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వెంటనే చర్యలు తీసుకుని వారి నుంచి ఔషధాలను తీసుకోవాలని ఆదేశించింది.
దేశంలోని విపత్కర పరిస్థితుల దృష్యా రోగులకు కావలసిన వైద్య సదుపాయాల కొరత సంభవించిందని, ఈ సమయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు ఔషధాలు, వైద్య పరికరాలను అధిక సంఖ్యలో సేకరించి పంపిణీ చేస్తామనడం సమంజసం కాదని, ఇలా చేసేవారి కారణంగా రోగులు నల్లబజారును ఆశ్రయించాల్సి వస్తుందని కోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు ఇలా చేయడం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఔషధాలు, వైద్య పరికరాలను నిల్వ చేసే బాధ్యత రాజకీయ నాయకులది కాదని, నిల్వ చేయడాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రతి ఒక్కరూ హేతుబద్దంగా నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.