దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే కరోనా విషయంలో ప్రజలు భయడాల్సిన అవసరం లేదని, ప్రపంచ దేశాలతో పోల్చితే.. భారత్‌లో అతి తక్కువ శాతం మంది మాత్రమే కరోనా బారినపడ్డారని కేంద్రం వెల్లడించింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ ఉమ్మడి కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా పరిస్థితులపై, కేంద్రం తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇప్పటివరకు మనదేశంలో కరోనా బారిన పడిన వారి శాతం తక్కువేనని అన్నారు. ‘అమెరికా జనాభాలో దాదాపు 10.1 శాతం మంది కరోనా బారిన పడ్డారు. అలాగే ఫ్రాన్స్‌లో 9 శాతం మంది జనాభాకు ఈ మహమ్మారి సోకింది. ఇటలీలో 7.4 శాతం, బ్రెజిల్లో 7.3 శాతం మంది జనాభాను కొవిడ్ పీడించింది. ఇక రష్యాలో కూడా 3.4 శాతం మంది ప్రజలకు కరోనా సోకింది. కానీ ఆ దేశాలతో పోల్చితే మన దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 1.8 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇంకా 98.2 శాతం మంది క్షేమంగానే ఉన్నార’ని వెల్లడించారు.
ఇదిలా ఉంటే కేంద్రం పేర్కొన్న వివరాల ఆధారంగా జనాభా నిష్పత్తిలో చూస్తే.. అమెరికాతో పోల్చితే మన దేశంలో 5 రెట్లు తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఫ్రాన్స్‌తో పోల్చితే 4వ శాతం కూడా కరోనా బారిన పడలేదు. అలాగే బ్రెజిల్, ఇటలీలలో 3వ శాతం కూడా మన సమస్య లేదు. కానీ ఇంత పెద్ద దేశంలో ఇంత మంది ప్రజల మధ్య కేవలం 1.8 శాతానికి కరోనా సోకితేనే వైద్య సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఈ నిష్పత్తి మరింత పెరిగితే పరిస్థితి ఇంకెత దారుణంతా తయారవుతుందో తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోంది.