ప్రస్తుతం ఆర్సీబీకి ఓపెనర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు గేల్, ఫించ్, శామ్ బిల్లింగ్స్ వంటి ఆటగాళ్లు జట్టుకు మంచి ఓపెనర్లుగా ఉండేవారు. కానీ ఆ తరువాత వారిని జట్టులో నుంచి తీసేయడంతో ప్రస్తుతం ఆర్సీబీకి ఓపెనర్ల కొరత ఏర్పడింది. గతేడాది ఇంగ్లీష్ కీపర్ శామ్ బిల్లింగ్స్ కొన్ని మ్యాచ్‌లకు ఓపెనింగ్ చేసినా.. ఈ ఏడాది అతడు కూడా జట్టుకు దూరమయ్యడు. దీంతో ఓపెనర్ల కొరతతో ఆర్సీబీ తెగ ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా కోహ్లీనే ఓపెనర్‌గా అవతారమెత్తాడు. ఈ విషయాన్ని కోహ్లీనే ఓ వారం క్రితం వెల్లడించాడు. అయితే తాజాగా దీనిపై ఆర్సీబీ కూడా స్పందించింది.
కోహ్లీ ఓపెనింగ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ఓపెనర్‌గా కోహ్లీ ఎంత గొప్పగా ఆడగలడో ఈ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో నిరూపించాడని, ఐపీఎల్ ముందు జాతీయ జట్టు తరపున కోహ్లీ ఓపెనింగ్ చేయడం మా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింద’ని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఐపీఎల్ 14వ సీజన్‌లో విరాట్ ఓపెనర్‌గానే రానున్నాడని, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేస్తాడని తలిపారు. దీనివల్ల లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో జట్టుకు సరైన ఓపెనింగ్ జోడీ లభించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లీ ఓపెనింగ్ చేయడం గురించి గత నెల జరిగిన ఐపీఎల్ మినీ వేలంకంటే ముందే తమకు తెలుసని, దానిపై అందరం చర్చించాకే వేలంలో ముందుకెళ్లామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసి ఎంతలా హిట్ అయ్యాడో తెలిసిందే. దీంతో కోహ్లీ ఇక ఓపెనర్‌గానే వస్తాడని అభిమానులు ఎంతగానో ఆశపడినా.. జాతీయ జట్టుకు ఓపెనింగ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని నిరాశపరిచాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం తాను ఓపెనింగ్ చేస్తానంటూ గతవారం ఓ తీపికబురు అందించడంతో ఇప్పుడు అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా స్పష్టం చేయడంతో ఈ ఏడాది
టోర్నీలో కోహ్లీ ఓపెనర్‌గా రానున్నాడు. మరి ఇంగ్లండ్‌పై సక్సెస్ అయినట్లే.. ఆర్సీబీ తరపున కూడా అదరగొడతాడో లేదో చూడాలి.