మైదానంలోని అంపైర్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒత్తిడి తెస్తున్నాడని, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ అన్నాడు. మైదానంలో సంయమనంతో వ్యవహరించడం కోహ్లీ నేర్చుకోవాలని, ప్రత్యర్థి ఆటగాళ్లతోనూ, అంపైర్లతోనూ తరచుగా వాగ్వాదాలకు దిగడం మానుకోవాలని సూచించాడు. టీమిండియా, బీసీసీఐలను ఐసీసీ ఏమీ అనలేకపోతోందని, ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోందని, అందుకే కోహ్లీ అలా రెచ్చిపోతున్నాడని మండిపడ్డాడు. అతడి ప్రవర్తన వల్ల మిగతా ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇప్పటికైనా కోహ్లీని బీసీసీఐ నియంత్రించాలని, కోహ్లీ కూడా తన ప్రవర్తన మార్చుకోవాలని లాయిడ్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ తాజాగా ఓ పత్రికకు రాసిన వ్యాసంలో కోహ్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మైదానంలో అంత ఉద్రేకం పనికిరాదని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ‘ఇటు అంపైర్లు, ఆట ఆటగాళ్లతో కోహ్లీ తరచుగా వాగ్వాదాలకు దిగుతున్నాడు. అది అంత సరైన విధానం కాదు. అలాగే మైదానంలో ఉన్నంతసేపూ ఆటగాళ్లు అంపైర్లను కచ్చితంగా గౌరవించాలి. కానీ కోహ్లీ వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కోహ్లీ మరింత పరిణితి సాధించాల’ని లాయిడ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ ఇంగ్లండ్ మాజీలు మొదటి నుంచీ నోరు పారేసుకుంటూనే ఉన్నారు. ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ దేశ మాజీలంతా టీమిండియాను విపరీతంగా విమర్శించారు. తాజాగా తొలి వన్డేలో తమ జట్టు ఓడిపోయిన తరువాత మరో సారి ఇంగ్లండ్ మాజీలు టీమిండియాను, కోహ్లీని విమర్శించడం మొదలుపెట్టారు. మన జట్టు మానసికంగా దెబ్బతీయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఈ విమర్శలు చేస్తున్నారు.