కొంత కాలంగా భారత్ పాక్ మద్య ద్వేపాక్షిక సంబంధాలు దెబ్బ తినడంతో ఇరుజట్ల మధ్య ఎలాంటి క్రికెట్ టోర్నీలు లేకుండా పోయాయి. 2012-13 తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య ఒక్క ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కూడా జరగలేదు. ఐసీసీ టోర్నమెంట్‌లలో మాత్రం అడపాదడపా పోటీ పడినా.. ఇండియానే ప్రతి చోటా పైచేయి సాధించింది. చివరిగా 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాక్‌తో తలపడిన టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక త్వరలో భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ టోర్నీ కోసం పాకిస్తాన్ బీసీసీఐకి కొన్ని షరతులు కూడా విధిస్తూ ఐసీసీకి లేఖ రాసింది. ఇలాంటి తరుణంలో పాక్ మీడియాలో ఓ విచిత్రమైన కథనం ప్రచారంలోకొచ్చింది. అదేంటంటే టీమిండియాతో పాకిస్తాన్ జట్టు ఓ టీ20 టోర్నీ ఆడబోతోందని, అది కూడా ఈ ఏడాదే జరగనుందని చెబుతోంది. ఈ వార్తతో ఇప్పుడు ఇరు జట్లు క్రికెట్ ప్రేక్షకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
‘పాకిస్తాన్ జట్టు భారత్‌లో త్వరలో పర్యటించబోతోంది. అది కూడా ఏకంగా ఈ ఏడాదిలోనే ఆ పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్-పాక్ మధ్య టీ20 ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. దీనికి ప్రేక్షకులంతా సన్నద్ధంగా ఉండాలి. ఈ విషయంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి’ అంటూ పాక్ మీడియా ఇటీవల తెగ ఊదరగొట్టేస్తోంది. అయితే దీనిపై అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో వేరే చెప్పక్కర్లేదు. ప్రేక్షకులే కాదు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య కూడా చాలా అగ్రెసివ్ వాతారణం ఉంటుంది. నిజానికి ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఓ ఆటలా కాకుండా చిన్న సైజు యుద్ధంలా సాగుంతుంది. కానీ దాదాపు 8 ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే మళ్లీ ఈ రెండు జట్లు మైదానంలో తలపడే రోజు అతి చేరువలో ఉందని పాక్‌లోని కొన్ని వార్తా సంస్థలు చెబుతుండడంతో మళ్లీ దాయాదుల పోరు చూడాలనుకునే వారికి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవేళ పాక్ మీడియా కథనం నిజమే అయితే ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. దాయిది పోరు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కల నెరవేరినట్లేనని చెప్పాలి.