మంగళవారం నుంచి టీమిండియా-ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. పుణె వేదికగా మార్చి 23, మార్చి 26, మార్చి 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం కర్ణాటక ఫాస్ట్‌బౌలర్ ప్రసీద్ కృష్ణకు జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ. మొత్తం ప్రాబబుల్స్‌లో ప్రసీద్ కృష్ణను కూడా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రసీద్ కృష్ణకు ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ మెక్‌గ్రాత్ అభినందనలు తెలిపాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్నందుకు అభినందనలని, సిరీస్‌లో మెరుగ్గా రాణించి, గొప్ప పేరు తెచ్చుకోవాలని సూచించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెబుతూ ప్రసీద్ కృష్ణ ఫొటో షేర్ చేశాడు.
ప్రసీద్ కృష్ణ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 3 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్ వంటి ఆసీస్ స్టార్ బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వారితో పంచుకున్న అనుభవాన్ని టీమిండియా ఆడడంలో ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చాడు. కాగా.. ప్రసీద్ కృష్ణ ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించాడు. మొత్తం టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన ప్రసీద్ కృష్ణ.. 14 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతడిని టీమిండియాకు ఎంపిక చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆడే అవకాశం కల్పించింది. మరి తుది జట్టులో కూడా ఇలా స్థానం లభిస్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కావడంపై ప్రసీద్ కృష్ణ ఎంతో ఆనందపడ్డాడు. ‘దేశం తరఫున ఆడేందుకు పిలుపు రావడం.. గొప్పగా ఉంది. నా కల నిజమైంది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం కల్పించిన బీసీసీఐకి థాంక్స్. తొందరగా సిరీస్ మొదలవ్వాలని అనుకుంటున్నా’ అంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.