ఈ మధ్య కాలంలో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడం బ్యాట్స్‌మెన్‌కు తెగ సరదా అయిపోయింది. ఇటీవల విండీస్ సిక్సర్ల వీరుడు కీరన్ పొలార్డ్.. శ్రీలంకపై ఈ ఫీల్ సాధిస్తే.. ఇప్పుడు ఓ శ్రీలంక బ్యాట్స్‌మన్ ఆ రికార్డును సాధించాడు. లంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా 6 బంతుల్లోనే 6 సిక్సులు కొట్టి ఈ ఫీట్ సాధించిన ఏకైక శ్రీలంక క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అయితే ఇది అంతర్జాతీయ మ్యాచ్‌లో కాదు.. లిస్ట్ ఏ క్రికెట్‌లో.
శ్రీలంక లిస్ట్-ఏ క్రికెట్‌లో భాగంగా ఎస్ఎల్సీ మేజర్ క్లబ్ టోర్నమెంట్‌లో ఆదివారం శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్, బ్రూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తిసార పెరీర.. ప్రత్యర్ధి బౌలర్, వెటరన్ ఫస్ట్ క్లాస్ స్పిన్నర్ దిల్హన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో చెలరేగాడు. అంతేకాదు కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి లంక తరపున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
కాగా.. 2005 నవంబర్‌లో రంగన క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానానికి ఇప్పుడు పెరీరా చేరాడు. పెరీరా వీర బాదుడుతో దిల్హన్ ఏకంగా 4 ఓవర్లలోనే 72 పరుగులు సమర్పించుకున్నాడు. పెరీరా విధ్వంసంతో శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఏకంగా 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 41 ఓవర్లలో ఈ టార్గెట్‌ను ఛేదించాల్సిన బ్రూమ్‌ఫీల్డ్ జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.