శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆ జట్టు కీపర్ ముష్ఫికర్ రహీమ్(125) సెంచరీతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ తర్వాత వర్షం పలుమార్లు కురవడంతో మ్యాచ్‌లో ఓవర్లను తగ్గించారు. లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, ముస్తఫిజుర్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా 103 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
Skipper .@TamimOfficial28 speaks after the 2nd ODI against Sri Lanka.#BCB pic.twitter.com/VRw7V0LqPn
— Bangladesh Cricket (@BCBtigers) May 26, 2021
మ్యాచ్ అనంతరం విజయం గురించి ముష్ఫికర్ రహీమ్ మాట్లాడాడు. ‘నా ఇన్నింగ్స్ తృప్తినిచ్చింది. అయితే, చివరి 11 బంతులు ఆడలేకపోవడం నిరాశ కలిగించింది. మహ్మదుల్లా కూడా గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు అద్భుతంగా రాణించారు. ఇలాంటి పిచ్‌పై ఆడటం అంత తేలికేమీ కాదు. కాబట్టి నేటి మ్యాచ్‌తో మా బ్యాట్స్‌మెన్ మరిన్ని పాఠాలు నేర్చుకున్నారనే అనుకుంటున్నాన’ని చెప్పుకొచ్చాడు.
ఇదే మ్యాచ్‌పై బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘రెండు మ్యాచ్‌లు గెలవడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే సిరీస్‌లో ఇంతవరకు మేం పరిపూర్ణంగా ఆడలేదనే అనుకుంటున్నాను. ముష్ఫికర్, మహ్మదుల్లా ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరు చేశాం. ఇక బౌలింగ్, ఫీల్డింగ్ కూడా బాగుంది. కానీ ఇది సరిపోదు. ఇంకా మేం మెరుగుపడాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో కొంత మెరుగుపడాలి. కొన్ని క్యాచ్‌లు మిస్ చేశాం. అవి కూడా పట్టి ఉంటే నేను మరింత సంతోషపడేవాడిని’ అని అన్నాడు.
ఇక ఓటమి విషయంలో తమకు రెండు మ్యాచ్‌లలోనూ నిరాశే మిగిలిందని శ్రీలంక కెప్టెన్ కుశాల్ పెరీరా అన్నాడు. ‘రెండు మ్యాచ్‌లలోనూ మాకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా మిడిలార్డర్ దారుణంగా కుప్పకూలింది. మా ఓటమికి అనుభవలేమి ప్రధాన కారణమైంది. అందుకే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా సమీక్ష చేసుకుంటాం. నిర్భయంగా ఆడాల్సిన అవసరం గురించి చర్చిస్తాం’ అని వెల్లడించాడు.
కాగా బంగ్లా గెలిచిన రెండు మ్యాచ్‌లలోనూ ముష్ఫికర్ రహీమ్ రాణించాడు. తొలి మ్యాచ్‌లో 84 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడిన ముష్ఫికర్.. రెండో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. దీంతో బంగ్లా సునాయాసమైన వియజం సాధించింది. సెంచరీతో కదం తొక్కిన ముష్ఫికర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2–0తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డే ఈ నెల 28న ఇదే వేదికపై జరుగుతుంది.