తూర్పున బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుపానుగా మారింది. బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రా ఓడరేవు సమీపాన తుఫాను తీరం దాటుతోందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. తుపాను భారీ స్థాయిలో ఉండడంతో.. తీరాన్ని దాటే ప్రక్రియ ముగియడానికి కొన్ని గంటలు పట్టనుందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ తీఫాను పూర్తిగా తీరాన్ని దాటుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీఏ జెనా వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా తీర ప్రాంతంలోని జిల్లాల్లో 140 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయని తెలుస్తోంది.
తుఫాను కారణంగా జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, జజ్‌పూర్, భద్రక్, బాలాసోర్, కటక్, ధేన్కనాల్ వంటి ప్రాంతాల్లో గంటకు 200మీమీ కంటే ఎక్కువ అంటే.. అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. వీటితో పాటు పూరి, ఖుద్రా, ఆంగల్, డియోగఢ్, సుందర్‌గఢ్ జిల్లాల్లోనూ భారీగా వానలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం యాస్ తీరాన్ని సమీపించనుంది. పర్బా మేదినిపుర్ జిల్లా పరిధిలో సముద్రంలో అలలు ఉధృతి పెరిగింది. సైక్లోన్ ప్రభావంతో ఒడిశాలోని ధామ్రా జిల్లాలో బలమైన గాలులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందట.
గురువారం ఉదయం 5 గంటల వరకు భువనేశ్వర్‌లోని విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. దీనికి కారణం వాతావరణం సక్రమంగా లేకపోవడమేనని తెలపింది. ఇక ఈ రోజు ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు కోల్‌కతాలోని విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. అలాగే ఈ తుఫాను కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు, సమీప ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోని పలు జిల్లాలపై తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 9లక్షల మందిని, ఒడిశా నుంచి సుమారు 3లక్షల మందిని ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుందని గువహటి ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దాంతో రెండు రాష్ట్రాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ను అక్కడి ప్రభుత్వం జారీ చేసింది.