ముంబై: గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌పై అనవసరంగా అంత ఖర్చు చేసిందని, అతడికి స్థిరంగా ఆడటం రాదని, అందుకే అన్ని ఫ్రాంచైజీలు అతడిని రిలీజ్ చేశాయని అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న గంభీర్ మ్యాక్స్‌వెల్ గురించి మాట్లాడారు. అతడిపై ఆర్‌సీబీ ఎన్నో ఆశలు పెట్టుకుందని, కాని అతడు అంతగా రాణించలేడని అన్నారు. మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది కూడా అందరికీ నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ అంటున్నారు.
గతేడాది పంజాబ్ తరపున ఆడిన మ్యాక్సీ అన్ని మ్యాచ్‌ల్లో 108 పరుగులు మాత్రమే చేశాడు. మళ్లీ ఈ ఏడాది మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం సుద్ద దండగ. అతడి వల్ల ఆర్‌సీబీ ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఐపీఎల్ సీజన్‌లోనూ మ్యాక్సీ అద్భుతంగా రాణించలేదు. ప్రతి ఏడాది మ్యాక్సీ తన ఫామ్ అందుకుంటాడని ఎందరో ఎదురుచూస్తుంటారు. మ్యాక్సీ మాత్రం వారికి నిరాశను మిగుల్చుతున్నాడని అన్నారు. అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడు. ఒక్క 2014 మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ప్రతి సీజన్‌లో పేలవమైన ఆటతీరే కనబరిచాడు.
మ్యాక్స్‌వెల్ తమ జాతీయ జట్టుకు ఇంకా అక్కడి ట్రోఫీల్లో మాత్రమే బ్యాటుతో విధ్వంసం చేస్తాడు. అది చూసి ఐపీఎల్‌లో అతనిపై కోట్ల వర్షం కురిపించడం అనవసరమని గంభీర్ చెప్పారు. ఈ విషయం తెలియక ఆర్‌సీబీ వేలంలో అతడిపై రూ. 14.25 కోట్లు కురిపించిందని చెప్పుకొచ్చారు. అయితే మైదానంలో అడుగు పెట్టినప్పటినుంచి తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకునే ఆటగాళ్లలో ఆండ్రీ రసెల్ ఒకడు. అతను ప్రతీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడంలేదని, మ్యాక్సీ కనీసం ఈ సీజన్‌లోనైనా రాణిస్తాడని ఆశిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్‌సీబీ అభిమానులు మ్యాక్సీపై తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. మరి మ్యాక్స్‌వెల్ వాటిని ఏ మాత్రం అందుకుంటాడో అనేది వేచి చూడాల్సిందే.