Friday, November 1, 2024

బెంగళూరు రికార్డ్ విన్.. మళ్లీ నెంబర్ వన్

ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. కేకేఆర్‌ను 38 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ విజయంతో 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ తొలిసారిగా వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ విజయంతో ఈ సీజన్ పాయింట్ల పట్టికలో కూడా 6 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

టాస్ గెలిచిన ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ దక్కలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(5), దేవదత్ పడిక్కల్(25)తో పాటు వన్ డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ పాటిదార్(1) కూడా వెంటనే పెవిలియన్ చేరారు. దీంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. కానీ.. మ్యాక్స్‌వెల్(78: 49 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్(76: 34 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) వికెట్ పడకుండా కాపాడుతూనే మైదానంలో బౌండరీల మోత మోగించారు. కేకేఆర్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కగా, ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో వికెట్ తీశారు.

ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. శుభ్‌మన్ గిల్(21: 9 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీలతో కొద్ది సేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే గిల్ అవుటైన తర్వాత రాహుల్ త్రిపాఠీ(25: 20 బంతుల్లో.. 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. కానీ పవర్ ప్లే ఆఖరి బంతికి త్రిపాఠి కూడా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్(29: 23 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు)లపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొద్ది సేపటికే వీరిద్దరూ వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్(2) కూడా నిరాశపరిచాడు. దీంతో కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత షకిబ్ అల్ హసన్(26: 25 బంతుల్లో.. 1 ఫోర్ల్, 1 సిక్స్), ఆండ్రూ రస్సెల్‌(31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్ పడకుండా కాపాడడం తప్ప మ్యాచ్ గెలిపించలేకపోయారు. భారీ షాట్లు ఆడకపోవడంతో అవసరమైన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఇక బెంగళూరు బౌలర్లు డెత్ ఓవర్లలో పట్టు బిగించడంతో కేకేఆర్ వరుస వికెట్లు కోల్పోయింది.

ఆఖర్లో రస్సెల్ మూడు బౌండరీలు కొట్టినా అప్పటికే కేకేఆర్ ఓటమి ఖరారైంది. దీంతో 20 ఓవర్లలో కేకేఆర్ 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసి 38 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కేకేఆర్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. బెంగళూరు బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు తీయగా, హర్షల్ పటేల్ 2, యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఏబీ డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x