220 పరుగులు చేసిన చెన్నైను సైతం వణికించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. 140 పరుగులను కూడా ఛేదించలేక చతికిలబడిన రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అది కూడా వాంఖడే లాంటి బ్యాటింగ్ పిచ్‌లో మ్యాచ్ జరుగుతుండడంతో కచ్చితంగా కేకేఆర్ భారీ స్కోరు చేస్తుందని అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. 9 వికెట్లు తీయడమే కాకుండా కేవలం 133 పరుగులకే నిలువరించారు. దీంతో రాజస్థాన్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. అంతా అనుకున్నట్లు రాజస్థాన్‌కు కూడా సులువుగా విజయం దక్కలేదు.
కేవలం 133 పరుగుల లక్ష్యాన్ని సైతం ఛేజ్ చేయడానికి రాజస్థాన్ చెమటోడ్చింది. 4 వికెట్లు కోల్పోయి ఎలాగోలా 19 ఓవర్లలో టార్గెట్‌ను రీచ్ అయింది. మొదట ఓపెనర్ జోస్ బట్లర్(5: 7 బంతుల్లో.. 1 ఫోర్) మొదటి వికెట్ రూపంలో వెంటనే అవుట్ కావడంతో యశశ్వి జైస్వాల్(22: 17 బంతుల్లో.. 5 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ సంజు శాంసన్(42 నాటౌట్: 41 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. జైస్వాల్ అవుటైన తరువాత శివమ్ దూబే(22: 18 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. అయితే శివమ్ దూబేతో పాటు రాహుల్ తెవాటియా కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో రాజస్థాన్ కొంత ఒత్తిడిలో పడింది. అయితే డేవిడ్ మిల్లర్(24 నాటౌట్: 23 బంతుల్లో.. 3 ఫోర్లు)తో కలిసి సంజూ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ ఈ సీజన్లో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరింది. కాగా.. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు కేకేఆర్ బ్యాట్స్‌మన్ కూడా భారీగా బ్యాటింగ్ చేయలేకపోయారు. శుభ్‌మన్ గిల్(11: 19 బంతుల్లో.. 1 ఫోర్), నితీశ్ రాణా(22: 25 బంతుల్లో.. 1 ఫోర్, 1 సిక్స్) చాలా నెమ్మదిగా ఆడారు. గిల్ అనవర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన తరువాత రాహుల్ త్రిపాఠీ(36: 26 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మన్ వెంటవెంటనే అవుటైపోయారు. ఇక కీపర్ దినేశ్ కార్తీక్(25: 24 బంతుల్లో.. 4 ఫోర్లు) పర్వాలేదనిపించినా.. చెన్నైతో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆండ్రూ రస్సెల్(9: 7 బంతుల్లో.. 1 సిక్స్) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లతో అదరగొట్టగా.. ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.