ముఖ్యమంత్రి పీఠం అధిరోహించకముందే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జర్నలిస్ట్‌లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జర్నలిస్ట్‌లను కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గానే గుర్తిస్తామంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడిన స్టాలిన్ వెల్లడించారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించి వారిని ఆదుకుంటామని సీఎం పేర్కొన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలను మరువలేమని, అనుక్షణం ప్రాణాలను లెక్క చేయకుండా వారు పోరాడుతున్నారని, అందుకే వారిని కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటిస్తున్నానని తెలిపారు.
స్టాలిన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తరువాత ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రంలోని వేల మంది జర్నలిస్టులు లబ్ధి పొందుతారు. అలాగే విధులు నిర్వర్తిస్తూ కరోనా వల్ల ఎవరైనా జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి కూడా ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉండే అవకాశం ఉంది.
కాగా.. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రకటించింది. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొంత కాలం క్రితమే ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. కరోనా సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు అనునిత్యం ప్రాణాలొడ్డి పోరాడుతున్నారని, రాష్ట్రానికి వారు చేస్తున్న సేవ చాలా గొప్పదని, కోవిడ్ వ్యతిరేక పోరాటంలో వారి మద్దతు వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అందుకే వారిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో కొవిడ్ వల్ల మరణించిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఒడిశా రాష్ట్రంలోని 6944 వర్కింగ్ జర్నలిస్టులకు ప్రయోజనం పొందుతున్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోంది.
ఒడిషాతో పాటు ఇప్పటికే మధ్యప్రదేశ్ సర్కారు కూడా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా లేదు. జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తమను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రకటించాలని జర్నలిస్టులు వేడుకుంటున్నా రెండు రాష్ట్రాల్లోనూ దీనిపై ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకు విడుదల కాలేదు.