దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారిని అణచివేయాలన్నా, కనీసం అదుపు చేయాలన్నా దేశవ్యాప్త లాక్‌డౌన్ తప్పదని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (సీఏఐటీ) పేర్కొంది. తమ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు అనుకూలంగా స్పందించినట్టు తెలిపింది. దీంతో దేశంలో వెంటనే లాక్‌డౌన్ విధించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఏఐటీ కోరింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు బీఎస్ భరటియా, సెక్రటరీ జనరల్ ప్రవీన్ ఖండేల్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్త లాక్‍డౌన్ సాధ్యం కాని పక్షంలో కేవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో పూర్తి లాక్‌డౌన్ విధించేలా అయినా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ లాక్‌డౌన్ ప్రకటించినా.. నిత్యావసరాల సరఫరా, లభ్యతల్లో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది ఎలా అయితే లాక్‌డౌన్‌లో సరుకులను నిరంతరాయంగా సరఫరా చేశామో ఈ సారి కూడా అదే విధానాన్ని అములు చేస్తామని తెలిపారు.
ఇప్పటికే వైద్య వ్యవస్థ కుప్పకూలిందని, సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తాము ఆన్‌లైన్ సర్వే నిర్వహించామని చెప్పారు. అందులో అత్యధిక శాతం మంది కరోనా చైన్‌ను బ్రేక్ చేయాలంటే దేశవ్యాప్త లాక్‌డౌన్ తప్ప మేరే మార్గం లేదని చెప్పినట్లు సీఏఐటీ పేర్కొన్నారు. తమ సర్వేలో దేశవ్యాప్తంగా 9,117 ట్రేడర్లు పాల్గొన్నారని, 78.2 శాతం ఇండియాలో కోవిడ్ పరిస్థితి అదుపుతప్పిందని అభిప్రాయపడగా, 67 శాతం మంది పాన్-ఇండియా(దేశవ్యాప్త) లాక్‌డౌన్‌కు తప్పదని చెప్పినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేత రాహుల్ గాంధీ కూడా దేశంలో లాక్‌డౌన్ విధించాలని పిలుపునిచ్చారు. వెంటనే దేశంలో లాక్‌డౌన్ అవరసం ఉందని, ప్రధాని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో కరోనా విజృంభణ ప్రభుత్వ వైఫల్యమేనని రాహుల్ అన్నాడు. దేశమంతటా ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొని ఉంటే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు. అంతేకాకుండా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అరికట్టేందుకు దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ తప్ప మరో మార్గం కనిపించడం లేదని, పరిస్థితులు మరింత చేజారిపోకుండా ఉండాలంటే అదొక్కటే పరిష్కారంగా కనిపిస్తోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 3.58 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 3,449 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.