ఈ భమి మీద అత్యంత దారుణమైన బాధ ఏదంటే.. ప్రసవసమయంలో తల్లి పడే బాధే. ప్రాణాలతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. దానికోసం ఎంతో సేపు నొప్పితో విలవిల్లాడుతుంది. ఆ నొప్పిని భరించలేక ఆమె చేసే ఆక్రోసిస్తుంది. కానీ వీటన్నింటినీ పుట్టబోయే పేగు బంధం కోసం భరిస్తుంది. చివరికి జన్మనిచ్చిన బిడ్డను చూసుకుని ఈ బాధనంతా మర్చిపోతుంది. అయితే ఈ బాధలన్నీ లేకండా కేవలం అరనిముషంలోనే బిడ్డకు జన్మనిచ్చేస్తే..? కంగారు పడకండి.. అలాంటి కొత్త టెక్నాలజీ ఏమీ రాలేదు. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ ఇలానే తన బిడ్డకు జన్మనిచ్చింది. ఎలాంటి బాధ లేకుండా, పురిటి నొప్పులూ లేకుండా తన బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో 29 ఏళ్ల సోఫీ బగ్ తన భర్త క్రిస్‌తో కలిసి నివశిస్తోంది. ఆమె 38 వారాల నిండు గర్భిణి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఆమె బాత్‌రూంకు వెళ్లగా.. పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో సాయం కోసం భర్తను కేకేసింది. భర్త వచ్చేటప్పటికి సోషీ బాత్‌రూం బయట మెట్లపై కూర్చుని ఉంది. ఆమె పరిస్థితి చూసిన క్రిస్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టమేమోనని భావించాడు. దీంతో అక్కడే డెలివరీ చేయాలనుకుని భార్యకు సూచనలివ్వడం ప్రారంభించాడు. భర్త సూచనకు అంగీకరించిన సోఫీ.. అతడు చెప్పినట్లే.. ఒక్క పుష్ ఇచ్చింది. ఆ ఒక్క పుష్‌తో బిడ్డ బయటకు వచ్చేసింది. కేవలం 27 సెకెండ్లలోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
`బాత్‌రూంకు వెళ్లాక సోఫీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె నన్ను పిలిచింది. నేను వెళ్లే సరికి బాత్‌రూం బయట సోఫీ కూర్చొని ఉంది. అప్పటికే ప్రసవం అవుతోందని గ్రహించాను. గట్టిగా పుష్ చేయమని చెప్పాను. తను అలాగే చేసింది. దీంతో కేవలం 27 సెకన్లలోనే పాప జన్మించింది. అంతా చాలా వేగంగా జరిగిపోయింద`ని క్రిస్ చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనతో సోఫీ చుట్టుపక్కల ఫేమస్ అయిపోయింది. అంతేకాదు అత్యంత వేగంగా ప్రసవించిన మహిళగా రికార్డు కూడా సృష్టించింది. ఇంత వేగంగా బిడ్డకు జన్మనివ్వడం సోఫీకి ఇదే మొదటి సారి కాదు. తన మొదటి బిడ్డనూ సోఫీ ఇంతే వేగంగా ప్రసవించింది. బాత్‌రూంకి వెళ్లిన 12 నిమిషాల్లోనే ఆమె తొలి బిడ్డను ప్రసవించింది. రెండో ప్రసవం కూడా బాత్‌రూంకి వెళ్లిన 26 నిమిషాల్లో జరగడం విశేషం. తాజాగా మూడో బిడ్డను కేవలం 27 సెకెండ్లలోనే ప్రసవించి తన రికార్డులను తానే అధిగమించింది.