దేశంలో కరోనా రెండో వేవ్ ధాటికి దేశం అల్లకల్లోలం అవుతోంది. ప్రతి రోజూ లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలోనూ కేంద్రం కొత్త పార్లమెంటు భవనం(సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం) నిర్మించే పనులను పూర్తి చేయాలని సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ప్రతిపక్ష నేత ప్రియాంక గాంధీ వాద్రా ఇదే విషయంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని అతలాకుతలం అవుతున్న సమయంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం పెట్టే ఖర్చును కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఉపయోగించాలని ఆమె డిమాండ్ చేశారు.
‘ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ డబ్బును కరోనా వ్యాక్సిన్లకు వెచ్చిస్తే 62 కోట్ల వ్యాక్సిన్ డోసులు వస్తాయి. లేదంటే 22 కోట్ల రెమిడిసివిర్ వయల్స్ కొనుగోలు చేయవచ్చు, లేదంటే పది లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లను 3 కోట్లు కొనవచ్చు, 12 వేల బెడ్ల సామర్థ్యంతో 13 ఎయిమ్స్ ఆసుపత్రులను నిర్మించవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంద’ని ప్రియాంక ప్రశ్నించారు.
దేశంలోని అత్యున్నత భవనాల నిర్మాణం కోసం కేంద్రం సెంట్రల్ విస్టా రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇందులో భాగంగా సరికొత్త ట్రయాంగిల్ పార్లమెంటు భవనాన్ని, ఓ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌ను నిర్మిస్తోంది. అంతేకాకుండా వీటితో పాటుగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న రాజ్‌పథ్‌ను తిరిగి నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతుల నివాస భవనాలను కూడా నిర్మిస్తున్నారు.
అయితే దేశంలో కరోనా పెరుగుతున్నా.. ఈ నిర్మాణాన్ని కొనసాగించడానికి కేంద్రం కూడా కొన్ని కారణాలను చెబుతోంది. వాటి ప్రకారం.. కరోనా మహమ్మారి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.
లాక్‌డౌన్ కారణంగా అక్కడ ఉన్న కార్మికులు ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అత్యవసర సర్వీసుల జాబితాలో చేర్చింది. ఈ మేరకు వారికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అయినప్పటికీ ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.