తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ షర్మిలకు రోజురోజుకూ నేతల బలం పెరుగుతోంది. ఇప్పటికే వేలాది మంది అభిమానులు, ద్వితియశ్రేణి నాయకులు, మాజీలు, కీలక నేతలు, కార్యకర్తలు షర్మిలకు తమ మద్దతు తెలియజేశారు. మరోవైపు జిల్లాల బాట బట్టిన ఆమె నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆ పర్యటన కాస్త ఆలస్యమైంది. కోడ్ గానీ లేకుంటే ఖమ్మం జిల్లా నుంచే తన కొత్త పార్టీకి శ్రీకారం చుట్టేవారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, వైఎస్ వీరాభిమానమున్న వారు షర్మిల పార్టీలోకి వచ్చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ మధ్యనే కాంగ్రెస్ మహిళా నేత, టీవీ చానెల్స్‌లో పార్టీ స్వరాన్ని గట్టిగా వినిపించే ఇందిరా శోభన్ పార్టీకి రాజీనామా చేసేసి.. షర్మిలను కలిశారు. ఆమెను స్వాగతించిన వైఎస్ తనయ.. ఇకపై పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయాలని బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. పార్టీలో పరిస్థితులు సరిగ్గా లేవని.. ఇక ముందు కూడా పరిస్థితులు చక్కబడే పరిస్థితులు లేవన్నట్లుగా ఆమె మీడియా వేదికగానే కుండబద్ధలు కొట్టారు. ఆ తర్వాత కూడా వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యి.. పలు విషయాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరైన ఏపూరి సోమన్న ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. తాను షర్మిల పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా తన అభిమానులు, సహచరులు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి షర్మిలతో సోమన్న భేటీ కానున్నారు. ఇప్పటి వరకూ ఈయన కాంగ్రెస్‌లో ఒక కీలకనేతగా.. మరీ ముఖ్యంగా ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌పై గళమెత్తాలన్నా.. పాట రూపంలో పాడాలన్నా ఈయన తర్వాతే మరెవరైనా. ‘ఎవడి పాలయ్యిందిరో.. తెలంగాణ.. ఎవరేలుతున్నారురో..’ అని సోమన్న పాడిన ఈ పాట అప్పట్లో పెనుసంచలనమే సృష్టించింది.
అలాంటి వ్యక్తి ఇప్పుడు షర్మిల పార్టీలోకి వెళ్తుండటంతో కేసీఆర్‌పై పాడే పాటలకు మరింత డోస్ పెంచి.. ఇకపై షర్మిలకు అనుకూలంగా పాడబోతున్నారన్న మాట. మొత్తానికి చూస్తే.. పార్టీ ఆవిర్భావానికి ముందే ఈ రేంజ్‌లో నేతలు, కార్యకర్తలు, నేతలు షర్మిల పార్టీలోకి వెళ్లిపోతున్నారంటే.. ఇక పార్టీ అనౌన్స్ చేస్తే మామూలుగా ఉండదేమో.!