భారత సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మొహరించి భారత భూభాగాలను ఆక్రమించుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర, తూర్పు సరిహ్దదుల వద్ద ఎప్పటికప్పుడు నిర్మాణాలు చేపడుతూ.. సైన్యాన్ని మొహరిస్తూ ఉంటుంది. కరోనాకు ముందు కూడా ఇలా దాదాపు వేల మంది సైన్యాన్ని, వారికి కావలసిన మందుగుండు సామగ్రిని బోర్డర్‌కు తరలించింది. అయితే కొన్నాళ్లకే చైనా సైనికులు ఆ చలిని తట్టుకోలేక అనారోగ్యాల పాలు కావడం మొదలు పెట్టారు. చెనా ఇప్పటికే తరచుగా సైనికులను మారుస్తూ వస్తోంది. అలాగే అనారోగ్యం బారిన పడిన సైనికులను ఆసుపత్రుల్లో చేర్పించి వారికి చికిత్స అందిస్తోంది. కానీ మిగతా సైనికులు కూడా ఈ చలిని తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
గతేడాది 50వేల మందిని తరలించిన చైనా.. ఏడాది లోపే దాదాపు 90శాతం మందిని మార్చేసినట్లు సమాచారం. ఇక్కడి అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితుల దెబ్బకు చైనా సేనలు కుదురుకోలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ విధులకు వచ్చిన సైనికులు కనీసం ఏడాది పాటు కూడా ఉండలేకపోతున్నారు. దీంతో వారిని పంపించి రిజర్వు దళాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తోంది.
అయితే చైనా సైనికుల్లో చాలా మంది కాలేజీ విద్యార్థుల వయసువారు ఉండడం, వారికి సరైన అవగాహన, అనుభవం లేకపోవడంతో ఈ మంచుకొండల్లో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలోకి కూడా జరుకుంటున్నారు. అయితే అదే సమయంలో భారత్ పరిస్థితి భిన్నంగా ఉంది. తమ సైనికులు పూర్తిగా ఆ వాతావరణానికి అలవాటు పడేలా శిక్షణ ఇచ్చింది. దీంతో భారత సైనికులు అత్యంత శీతల వాతావరణంలోనూ అన్ని వేల అడుగుల ఎత్తులో కూడా సాధారణంగానే డ్యూటీలు నిర్వహిస్తున్నారు.