కరోనా మహమ్మారి దెబ్బకు ఐపీఎల్ 14 సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐకి ఊహించని విధంగా వేల కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో టోర్నీలో మిగిలిన 31 మ్యాచ్‌ను కూడా ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ భావించింది. దీనికోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు యూఏఈ వేదికగా సెప్టెంబరులో టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు నిర్దిష్టంగా ఎప్పుడు మొదలు పెడతారనే దానిపై క్లారిటీ లేదు. కానీ తాజాగా లీగ్ నిర్వహణకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 19వ తేదీన ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్ తిరిగి ప్రారంభించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 9న ఐపీఎల్-2021 ప్రారంభమైంది. ఆ తర్వాత టోర్నీ కొనసాగుతుండగానే దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైంది. లక్షల కేసులు నమోదవడం ప్రారంభమైంది. మే 2న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ తొలి షెడ్యూల్‌లో చివరి మ్యాచ్. ఐపీఎల్‌లో ఇది 29వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాతి రోజు కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కేకేఆర్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఆ తర్వాత ఢిల్లీ కేపిటల్స్ ఆటగాళ్లు అమిత్ మిశ్రా తదితరులు కూడా కరోనా బారిన పడడంతో టోర్నీ మొత్తాన్ని బీసీసీఐ వాయిదా వేసింది.
కాగా.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి వందలాదిమంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నా.. టోర్నీ నిర్వహించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆగలేదు. కానీ చివరికి టోర్నీలో బయోబబుల్ లో ఆడుతున్న ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడడంతో వాయిదా వేయక తప్పలేదు.