భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇకపై క్రికెట్ పాఠాలు చెప్పబోతున్నాడు. సొంతంగా క్రికెట్ కోచింగ్ సెంటర్ మొదలు పెట్టబోతున్నాడు. అది కూడా ఏదో ఒకరిద్దరికి కాదు. దేశంలోని యువత మొత్తానికి ఆన్‌లైన్‌లో ఈ పాఠాలు చెప్పబోతున్నాడు. దీనికోసం క్రికెట్ ఆన్‌కలైన్ లెర్నింగ్ వెబ్‌సైట్ CRICURUని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి వీరూ భాయ్.. ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు.
ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి వీరూ మాట్లాడుతూ.. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్‌సైట్ అని, ఈ వెబ్‌సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నామని చెప్పాడు. ‘CRICURU సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి ఏ స్థాయి శిక్షణ ఇస్తారో అదే స్థాయి కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వీరూ తెలిపాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్‌ఫర్ట్‌లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తాం. తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుంది’ అని వీరూ వివరించాడు.
వెబ్‌సైట్ కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కోచింగ్ అందించడమే తమ లక్ష్యమని, ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకునే వెసలుబాటును తమ వెబ్‌సైట్ కల్పిస్తుందని, ఇందుకు కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలని అన్నాడు. ‘ఈ వెబ్‌సైట్‌లో కోచింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉండనున్నాయని, అలాగే కోచింగ్ క్లాస్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు www.cricuru.comకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల’ని తెలిపారు. ఇక ఈ వెబ్‌సైట్ ఏడాదికి రకరకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయని, అవి రూ.299 నుంచి ప్రారంభమవుతుందని బంగర్ తెలిపాడు.