టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ క్రికెటర్లపై ఎప్పుడూ నోరు పారేసుకుంటూ ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ విషయంలో అతడిపై బీసీసీఐ కూడా ఇప్పటికే కొన్ని సార్లు వేటు కూడా వేసింది. ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు చెప్పి రిటర్న్ వచ్చాడు. కానీ అతడి నోటికి మాత్రం ఇంకా అడ్డుకట్ట పడలేదు. 2019లో కూడా మంజ్రేకర్.. టీమిండియా ఆల్‌రౌండర్ జడేజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ వేటుకు గురయ్యాడు. దీంతో ఐసీసీ కామెంటేటర్స్ ప్యానెల్ నుంచి కూడా మంజ్రేకర్‌ను బీసీసీఐ తొలిగించింది. అయితే ఆ తర్వాత తాను చేసిన తప్పును ఒప్పుకుని తిరిగి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా గురించి మంజ్రేకర్.. ఓ అభిమానితో చేసిన చాట్ తాజాగా బయటకొచ్చింది.
సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్, తాను మంజ్రేకర్‌తో జరిపిన ట్విటర్ సంభాషణను లీక్ చేశాడు. అందులో మంజ్రేకర్.. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అసలు తాను ఏం చెబుతున్నానో కూడా అతనికి అర్థం కాదని హేళన చేయడం… బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం జడేజాకు ఇప్పటికీ తెలీదని, కనీసం దాని అర్ధం తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయడం.. అలాగే ‘వెర్బల్ డయేరియా(నోటి విరేచనాలు)’ అంటూ జడేజా తననుద్ధేశించి సంబోధించిన పదాన్ని కూడా ఎవరైనా అతనికి చెప్పి ఉంటారని ఎగతాలి చేయడం గమనించవచ్చు. అక్కడితో ఆగని మంజ్రేకర్.. సదరు అభిమానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీలా ప్లేయర్స్‌ను పొగడటానికి నేను అభిమానిని కాదు. ఓ విశ్లేషకుడిని’ అంటూ అహంకార పూరిత వ్యాఖ్యలు కూడా చేశాడు.
అసలు వివాదం ఇదే:
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని సంబోధిస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జడ్డూ కూడా ఘాటుగానే స్పందించాడు. మంజ్రేకర్.. నీ కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లను ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇప్పటికే చాలా విన్నాను. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు’ అంటూ కౌంటరిచ్చాడు.