ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా జరుగుతున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యజాచ్ జరుగబోతోంది. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టీమ్ చరిత్ర సృష్టిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ టైటిల్ సాధించి టెస్ట్ ఛాంపియన్ షిప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా లేదా టై అయితే రెండు జట్లనూ ఐసీసీ సంయుక్త విజేతలుగా ప్రకటించనుంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ కొత్త జెర్సీలతో దర్శనమివ్వనున్నాయి. టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన టోర్నీ ఫైనల్‌లో ఇరు జట్లూ తమ కొత్త జెర్సీలను మార్చబోతున్నట్లు ప్రకటించాయి. అందులో భారత జెర్సీని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బయటపెట్టాడు. ఆ జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జడేజా.. ‘రివైండ్ టు 90s’ అని కొటేషన్ జత చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ పేరుతో ఉన్న ఆ జెర్సీ అచ్చం 1990ల నాటి టీమిండియా జెర్సీని పోలి ఉంది. దీంతో అభిమానులకు తెగ సంబరపడిపోతున్నారు.
ఇదిల ఉంటే గత ఆసీస్ పర్యటనలో గాయపడిన జడేజా మూడు నెలల విశ్రాంతి తరువాత తిరిగి జట్టులోకొచ్చాడు. ఇక ఈ మధ్య జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున జడేజా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ మెరుపులు పెరిపించాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో జడేజా టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లోనూ కచ్చితంగా ఆడే ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు. మరి ఈ పర్యటనలో ఇంగ్లీష్ పిచ్‌లపై జడేజా ఎలా రాణిస్తాడో చూడాలి.