కాకినాడలో ఓ బెట్టింగ్ కింగ్ వ్యవహారం బయటకొచ్చింది. కేవలం 20 రోజుల్లో రూ.20 కోట్ల బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించిన సదరు దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్థాన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌పై ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాలో ప్రధాన సూత్రధారిగా సోమన్నను గుర్తించారు. సదరు సోమన్న ఏపీకి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సోమన్న కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణా పరిధిలోని నిజాంపేటలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఆన్‌లైన్ బెట్టింగులు నిర్వహిస్తునట్లు సమాచారం అందడంతో.. మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న అయిదుగురిని అరెస్టు చేశారు. వారంతా సోమన్న కింద పని చేస్తున్నట్లు గుర్తించారు. అసలు నిందితుడి కోసం వేట సాగిస్తున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలోనే రూ.20 కోట్లకుపైగా బెట్టింగులు నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడంతో ఈ కేసుకు ప్రాధాన్యం పెరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగుల నిర్వహణలో నిందితుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. వైసీపీ ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో సోమన్న ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బుధవారం హల్‌చల్ చేయడం చర్చనీయాంశమైంది.
కాగా.. రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామానికి చెందిన సోమన్నకు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నిందితుడికి పలు వ్యాపారాల్లో వాటాలు ఉన్నట్లు జిల్లా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే తెలంగాణ పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఎలాంటి సమాచారం రాలేదని రాజమహేంద్రవరం అర్బన్, జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.