జపాన్ రాజధాని టోక్యోలో ఈ సారి ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ దఫా ఓ స్టార్ ఆటగాడు లేకుండానే టోర్నీ జరగబోతోంది.
అతదేవరో కాదు.. ఉస్సేన్ బోల్ట్. పరుగుల రారాజు బోల్ట్ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న తొలి విశ్వ క్రీడలు కావడంతో అతడిని దాటే గొప్ప రన్నర్ ఎవరనే ఆసక్తి ప్రస్తుతం అందయిలో నెలకొంది.
అయితే ఈ ప్రశ్నకు బోల్ట్.. చెప్పకనే సమాధానం చెప్పాడు. 100 మీటర్ల టైటిల్ కొట్టే మొనగాడెవరో బోల్ట్ చూచాయగా చెప్పేశాడు.
అమెరికాకు చెందిన ట్రేవాన్ బ్రోమెల్‌కు ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అతనిపై ఓ కన్నేసి ఉంచాలని బోల్ట్ అంటున్నాడు.
‘నాకిష్టమైన రేసులో నేను లేకుండా మరొకరిని విజేతగా చూడడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈసారి బ్రోమెల్ ప్రదర్శనపై ఆసక్తిగా ఉన్నా. కొన్నేళ్లుగా తను అద్భుతంగా రాణిస్తున్నాడు.
గాయాల కారణంగా కొంత వెనుకబడ్డాడుగానీ, లేదంటే అతను చాలా మంచి రన్నర్’ అని బోల్ట్ తెలిపాడు.
గతవారం జరిగిన యూఎస్ ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రయల్స్‌లో బ్రోమెల్ 100మీటర్ల టైటిల్ పట్టేశాడు.
2016 ఒలింపిక్స్ తర్వాత బ్రోమెల్ చాలాకాలం గాయాలతో బాధపడ్డాడు.
కాగా 34 ఏళ్ల బోల్ట్ ఖాతాలో ఎనిమిది ఒలింపిక్ స్వర్ణాలు ఉండడం విశేషం. అంతేకాకుండా 100మీటర్ల పరుగును 9.58 సెకన్ల టైమింగ్‌తో పూర్తిచేసిన ప్రపంచ రికార్డు బోల్ట్ పేరునే ఉంది.
కెరీర్లో అత్యద్భుతంగా రాణిస్తున్న తరుణంలోనే బోల్ట్ 2017లో తన అథ్లెటిక్స్ కెరీర్ కు ముగింపు పలికి అభిమానులను షాక్ కు గురిచేశాడు.
ఈ స్ర్పింట్ స్టార్ 2008 బీజింగ్ నుంచి 2016 రియో ఒలింపిక్స్ వరకు… వరుసగా మూడు ఒలింపిక్స్‌లో దుమ్మురేపాడు. మరి ఈ సారి బోల్ట్ రికార్డును బ్రోమెల్ అధిగమిస్తాడేమో చూడాలి.