క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ టోర్నీ వచ్చిన తర్వాత ఆటగాళ్లకు కాసుల వర్షం మొదలైంది. ప్రేక్షకులకు అదిరిపోయే మజా అందుతోంది.
ఇక బీసీసీఐకి వేల కోట్ల లాభాలు వచ్చి పడుతున్నాయి. ఈ టోర్నీలో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లంతా క్యూలో నిలబడతారు. వెస్ట్ ఇండీస్ వంటి దేశాల ఆటగాళ్లయితే తమ దేశం తరపున ఆడడం కంటే ఐపీఎల్ ఆడేందుకు యటపడతారంటే అతిసయోక్తి కాదు.
అయితే ఇప్పుడు అదే విండీస్ కు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీ20 ఫార్మాట్ అసలు క్రికెట్టే కాదని, అందుకే ఆ ఫార్మట్‌లో జరిగే ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో కామెంటరీ చెప్పడానికి తాను ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హోల్డింగ్.. ‘నేను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతాను. అయితే ఐపీఎల్‌ను నేను క్రికెట్‌గా పరిగణించను. అందుకే దానికి కామెంటరీ చెప్పడానికి ఇష్టపడను’ అంటూ తేల్చి చెప్పారు.
అలాగే ప్రస్తుత విండీస్ క్రికెట్ దుస్థితిపై కూడా హోల్డింగ్ మాట్లాడారు. టీ20ల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో తమ దేశం రాణించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవలి కాలంలో తమ జట్టు పొట్టి ఫార్మాట్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆ గెలుపు అసలు గెలుపే కాదని, ఈ టోర్నీలు నెగ్గడం విండీస్ క్రికెట్‌కు ఎలాంటి మేలు చేయదని చెప్పుకొచ్చారు.
‘విండీస్ క్రికెటర్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం మానేసి, డబ్బు కోసం ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్‌ల బాట పట్టారు. విండీస్ లాంటి పేద దేశం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేదు.
అందుకే ఇక్కడి ఆటగాళ్లు ఆ దేశాల్లో జరిగే టీ20 క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. వేతన వివాదాలపై మా దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య అనేక వివాదాలున్నాయి. ఇలాంటి పరిస్థితులుంటే ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరు..?’ అని వ్యాఖ్యానించారు.