కర్ణాటక రాజధాని బెంగళూరులో గతేడాది మే నెలలో భారీ శబ్దాలు వినిపించిన విషయం తెలిసిందే. అప్పట్లో అదో సంచలనంగా మారింది. స్థానికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే సోనిక్ బూమ్ కారణంగానే ఈ శబ్దాలు వచ్చాయని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. తాజాగా మరోసారి అలాంటి భారీ శబ్దాలే నగరంలోని అనేక ప్రాంతాల్లో వినిపించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో షార్జాపూర్ ఏరియా, జేపీ నగర్, బెన్సన్ టౌన్, ఉల్సూరు, ఇస్రో లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, సౌత్ బెంగళూరు, ఈస్ట్ బెంగళూరులో ఈ శబ్దాలను అనేక మంది ప్రజలకు వినిపించింది. దీంతో బెంగళూరు వాసుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి శిక్షణ యుద్ధ విమానం ఆకాశయానం ప్రారంభించడంతో ఈ శబ్దాలు వినిపించినట్లు కొందరు భావిస్తున్నారు. సోనిక్ బూమ్ కారణంగానే బెంగళూరులో భారీ శబ్దం వినిపించి ఉండొచ్చని అంటున్నారు.
అయితే దీనిపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేసింది. యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు ప్రతి రోజూ ప్రయాణిస్తూ ఉంటాయని, ఈరోజు ప్రత్యేకంగా ఏమీ జరగలేదని హెచ్ఏఎల్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. నగరంలో నేడు వినిపించినట్లు చెప్తున్న శబ్దాలపై హెచ్ఏఎల్ ఎటువంటి వ్యాఖ్య చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ శబ్దాలకు సోనిక్ బూమ్ కారణమని పోలీసులు కానీ, వైమానిక దళం కానీ ధృవీకరించలేదు.