యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎలాంటి క్రికెటరో వేరే చెప్పక్కర్లేదు. అతడి బ్యాట్‌కు బంతి తగిలిందంటే.. అది స్టేడియం దాటి పోవాల్సిందే. అలాంటి సిక్సర్ల వీరుడు గేల్. అయితే గేల్ మైదానంలో చాలా ఫన్నీగా ఉంటాడు. వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా, బండరీలు బాదినా డ్యాన్సులు చేస్తూ, గెంతులేస్తూ తన ఆనందాన్ని మైదానంలోనే ప్రకటిస్తాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో కూడా గేల్ ఇలాంటి పనే చేశాడు. తన ఓవర్లో వేసిన తొలి బంతికే హెండ్రిక్స్ వికెట్ దక్కించుకున్నాడు. దీంతో ఆనందం పట్టలేని గేల్.. పల్టీలు కొట్టడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో.. కెప్టెన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు ప్రత్యర్థికి బలమైన పోటీ ఇస్తోంది. 5 టీ0ల సిరీస్‌లో నాలుగో టీ20 గురువారం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (25 బంతుల్లోనే 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించగా.. లెండిన్ సిమన్స్ 47 పరుగులుతో రాణించాడు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను విండీస్ బౌలర్లు బాగా కట్టడి చేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బంతి గేల్ చేతికిచ్చిన పొలార్డ్.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గేల్ తొలి బంతితోనే నిలబెట్టుకున్నాడు. డేంజరస్ ప్లేయర్ రీజా హెండ్రిక్స్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. తన వ్యూహం ఫలించన్న ఆనందంలో హెండ్రిక్స్ పెవిలియన్ వెళ్లే సమయంలో గేల్ మైదానంలోనే పల్టీలు కొట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గేల్ తీరుపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.”41 ఏళ్ల వయసులో గేల్ ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడితే.. గేల్‌కు వయసుతో సంబంధం లేదని.. అతని ఫిట్‌నెస్ అమోఘం” అంటూ మరొకొందరు పేర్కొన్నారు.
How do you see this celebration of 41 year old @henrygayle 💪#WIvSA pic.twitter.com/I3Bvh7wfo7
— Diptiman Yadav (@Dipti_6450) July 2, 2021
కాగా.. బ్యాటింగ్‌లో 5 పరుగులు మాత్రమే చేసిన గేల్.. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. బౌలింగ్‌లో ఫీల్డింగ్‌లోనూ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. క్వింటన్ డికాక్ 60 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతావారు ఎవరు చెప్పుకోదగ్గ స్కోరుగా చేయలేకపోయారు. ఈ మ్యాచ్ విజయంతో వెస్టిండీస్.. సిరీస్‌ను సమం చేసింది. నిర్ణయాత్మక 5వ టీ20 శనివారం జరగనుంది.