ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ స్టార్స్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలు ఫిట్‌నెస్ పరీక్షల్లో విఫలం కావడంపై ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారిద్దరికీ ఆటపై అంకితభావం లేదని అందుకే ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారని విమర్శించాడు. ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన జంబో జట్టులో వరుణ్, తెవాటియాల పేర్లు కూడా ప్రకటించింది. అయితే ఆ తర్వాత బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో వీరిద్దరూ ఫెయిలయ్యారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ..ఎన్‌సీఏలో ఈ టెస్ట్ నిర్వహించారు. ఆటగాళ్లతో పాటు వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా ఫెయిలయ్యారు. రెండో సారి కూడా అవకాశమిచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ తరఫున ఆడే అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్నారు.
ఇలా ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి, తెవాటియా ఫెయిల్ కావడంపై లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హగ్ తన యూట్యూబ్ చానెల్‌లో ప్రస్తావించాడు. తెలాటియా, వరుణ్‌లకు ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడ్డాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలు సాధించడంలో రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి ఫెయిలయ్యారు. వారికి ఆటపై అంకితభావం లేదు. టీమిండియా నిర్దేశించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో వాళ్లు ఫెయిల్ కావడం ఆశ్చర్యాన్ని, బాధను కలిగించింది. ఇదే వారికి చివరి అవకాశం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది’ అని అన్నాడు.
యువత వారికేం కావాలనే విషయంపై స్పష్టంగా ఉండాలని, ఎంచుకున్న రంగంలో రాణించడానికి అహర్నిశలూ శ్రమించాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాడు. తమ ప్రతిభకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ముందుకెళ్లాలని అని అన్నాడు.
ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఇలా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారడం రెండోసారి. గత సీజన్ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీ20 జట్టులో చోటు దక్కింది. కానీ గాయం కారణంగా అతను వెళ్లలేకపోయాడు. ఇక ఇప్పుడు రెండోసారి కూడా అవకాశం టీమిండియాలోకి అడుగుపెట్టే సువర్ణావకాశం వచ్చింది. కానీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ కావడంతో ఈ సారి కూడా జట్టులోకి రాలేకపోయాడు. మరి అతడిని మళ్లీ తీసుకునేందుకు మేనేజ్‌మెంట్ మళ్లీ ఆలోచన చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.