ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ టీమిండియాను విమర్శించడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు. మొన్నటివరకు టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియాపై నోటికొచ్చినట్లు మాట్లాడిన వాన్.. ఈ సారి టీ20ల్లోనూ అదే రూల్ ఫాలో అవుతున్నాడు. తాజాగా టీమిండియా- ఇంగ్లండ్ తొలి టీ20లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో మరో 27 బంతులు మిగిలుండగానే విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందించాడు.
‘భారత జాతీయ టీ20 జట్టు కంటే, ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ బాగున్నట్లు ఉంది’ అంటూ ట్విటర్‌లో ఓ సెటైర్ వేశాడు. ఈ పోస్ట్ చూపిన జాఫర్‌కు కోపం వచ్చింది. అయితే అతడు కూడా తనదైన స్టైల్లో వాన్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘నలుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడించే అదృష్టం అన్ని జట్లకూ ఉండదు కదా మైఖేల్’ అని తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. జాఫర్ ఇచ్చిన కౌంటర్‌కు వాన్‌కు దిమ్మతిరిగినంత పనైంది. ఎందుకంటే ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో విదేశీ ఆటగాళ్లకు కొదవే లేదు. దాదాపు సగంమంది వరకు విదేశాలకు చెందిన వారే ఇంగ్లీష్ జట్టులో ఉన్నారు. ఇంకా విచిత్రమేమంటే ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఇంగ్లండ్ జాతీయుడు కాదు.
ఈ నేపథ్యంలోనే విదేశాల్లో జన్మించి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ల ప్రతిభను, ఇంగ్లండ్ జట్టు విజయంలో వారి పాత్రను వాన్‌కు వసీం గుర్తు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, ఇయిన్ మోర్గాన్, జోఫ్రా ఆర్చర్, మైఖెల్ జోర్డాన్ వంటి ఆటగాళ్లంతా విదేశాల్లో జన్మించి ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లే. వీరిలో స్టోక్స్ న్యూజిల్యాండ్ ఆటగాడు కాగా, మోర్గాన్ ఐర్లాండ్ ఆటగాడు. మోరగాన్ ఐర్లాండ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇక రషీద్ పశ్చిమ ఆసియాకు చెందిన ఆటగాడు. అలాగే జోర్డాన్, ఆర్చర్ ఆఫ్రికా దేశీయులు.