టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఎంత భిన్నమైన నటుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హాస్యాన్ని పండిస్తూనే ఎమోషనల్‌గాను అలరించనున్నాడు. సీరియస్ పాత్రలలోను జీవించేస్తాడు. కెరీర్ తొలి నాళ్ళలో వరుసగా హాస్య కథా చిత్రాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన అల్లరి నరేష్ సుడిగాడు చిత్రం తర్వాత మరో హిట్ అందుకోలేకపోయాడు. మధ్యలో చాలా చిత్రాలు చేసినా కూడా ఏ చిత్రం పెద్దగా ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఈ క్రమంలో వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కథ సినీ ప్రేక్షకులకి ఎంతగానో కనెక్ట్ కావడమే కాకుండా అల్లరి నరేష్‌కు మంచి విజయం దక్కేలా చేసింది.
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం నాంది ఎంత ఉద్వేగభరితంగా సాగిందో మనందరికి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ విజయ్ కనకమేడల చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మంచి కథకు మంచి నటుడు దొరికితే సినిమా ఎంత హిట్ అవుతుందనేది నాంది మూవీ నిరూపించింది. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మించారు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఆహా ఓటీటీలో విడుదలైంది. ఇప్పటి వరకు 120 మిలియన్ నిమిషాల వ్యూవర్ షిప్స్ ను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది రికార్డ్ అని అంటున్నారు. క్రాక్ చిత్రం కూడా దాదాపు ఇదే రేంజ్‌లో వ్యూయర్ షిప్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
It has been a phenomenal weekend for #NaandhiOnAHA.
Have you watched this thriller yet?@allarinaresh @varusarath5 @vijaykkrishna @SatishVegesna @priyadarshi_i pic.twitter.com/AqYZXCyJX3— ahavideoIN (@ahavideoIN) March 15, 2021
ఎనిమిదేళ్ల తర్వాత నాంది రూపంలో అల్లరి నరేష్‌కు మంచి హిట్ దక్కడంతో ఆయన ప్రెస్‌మీట్‌లో కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తానని అన్నాడు. నాంది చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన అద్భుతంగా ఉంది. మిగిలిన వారు కూడా తమ పరిధి మేర బాగానే నటించారు. నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్‌రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణిచందన, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా బహ్మ కడలి పని చేశారు. ఏదేమైనా నాంది చిత్రం అల్లరి నరేష్ కెరీర్‌కు మంచి నాందిగా మారిందనే చెప్పాలి.