అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ ఓటమితో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం సాధించింది. గత మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుతిరిగిన కేఎల్ రాహుల్(0) ఈ మ్యాచ్‌లో కూడా సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక తొలి రెండు టీ20లు మిస్ అయిన రోహిత్ శర్మ(15) ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చినా నిరాశే మిగిల్చాడు. ఇక రెండో టీ20లో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్(4) ఈ మ్యాచ్‌లో రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(77) మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. రెండో టీ20లో లానే ఈ మ్యాచ్‌లో కూడా అర్థ సెంచరీతో అదరగొట్టాడు. కానీ అతడికి అవతలి వైపు నుంచి సరైన మద్దతు లభించలేదు. ఇషాన్ అవుటైన తరువాత కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(25) కొద్ది సేపు మెరుపులు మెరిపించినా కొద్ది సేపటికే రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ అనవర రన్‌కు ప్రయత్నించడంతో పంత్ తన వికెట్‌ను త్యాగం చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్(9) థర్డ్ మ్యాన్‌లో సిక్స్ కొట్టబోయి అవుటయ్యాడు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా కొద్దిగా మెరుపులు మెరింపించినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. చివరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ మరోసారి అర్థ సెంచరీతో రాణించాడు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో కోహ్లీ గేర్ మార్చి బ్యాటు ఝుళిపించాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3 వికెట్లు తీయగా, జోర్డాన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ జోస్ బట్లర్(83) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్(9) విఫలమైనా బట్లర్ చెలరేగి ఆడాడు. భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఆ తర్వాత డేవిడ్ మలాన్(18) వెంటనే అవుట్ అయినా, బెయిర్ స్టో(40) బట్లర్‌కు చక్కగా మద్దతునిచ్చాడు. దీంతో ఇంగ్లండ్ మరో 10 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఇక భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో వికెట్ దక్కింది.