రూపేష్ కథానాయకుడిగా MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 37 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ కథానాయిక. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. లుక్ చాలా బావుందని, దర్శకుడు పవన్ ప్రభకు ఇది తొలి చిత్రమైనప్పటికీ చక్కగా డిజైన్ చేశారని, సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ”పిల్లలు ఎవరైనా తమ తల్లిదండ్రుల పెళ్లి చూడలేరు. షష్టిపూర్తి ద్వారా ఆ లోటు తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. ఆ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. కొంత టాకీ, ఇంపార్టెంట్ యాక్షన్ సీన్ ఒకటి బాలన్స్ ఉంది. ఆ యాక్షన్ సీన్ కోసం మా హీరో రూపేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో వాళ్ళిద్దరూ వివిధ వయసులో కనిపిస్తారు. ఓ రెట్రో ఎపిసోడ్ కూడా వాళ్లపై తీశాం. వాళ్ళిద్దరూ 30 ఏళ్ళ క్రితం ఎలా ఉండేవారో అందులో అలా ఉంటారు. యానాం సమీపంలోని తాతపూడిలో తీశాం. సినిమాలో మొత్తం 80 లొకేషన్లు ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగింది. గోదావరి హృదయాన్ని, అక్కడ అందాన్ని ఆవిష్కరించే ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. ఒక్క పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి చిత్రీకరించాం. మిగతా పాటలను గోదావరి ప్రాంతంలో తీశాం. సినిమాలో మంచి మ్యూజికల్ జర్నీ ఉంటుంది. అందుకని, ఇసైజ్ఞాని ఇళయరాజా గారిని తీసుకున్నాం. బలమైన భావోద్వేగాలను ఆవిష్కరించడానికి ఆయన అయితే న్యాయం చేస్తారని మా నమ్మకం” అని చెప్పారు.
సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ”కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి సీనియర్ హీరో హీరోయిన్లతో నటించడం లెర్నింగ్ ప్రాసెస్ అండ్ బ్లెస్సింగ్! కథ విన్న వెంటనే మా సంస్థలో నిర్మించాలని నిర్ణయించుకున్నా. ఉన్నత సాంకేతిక విలువలతో రాజీ పడకుండా ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని మా ప్రయత్నం. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా గారితో పాటు కళా దర్శకుడు తోట తరణి వంటి మహామహులతో సినిమా చేయడం కోసం ఏడాది పాటు కృషి చేశాం. మంచి కథతో రూపొందుతున్న సినిమాలో నేను భాగం కావడంతో పాటు నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 80 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.
‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిది. రూపేష్, ఆకాంక్షా సింగ్, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం.
‘షష్టిపూర్తి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ కంట్రోలర్ : బిఎస్ నాగిరెడ్డి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్టంట్స్ : రామకిషన్, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్ : చైతన్య ప్రసాద్, రెహమాన్, కో డైరెక్టర్ : సూర్య ఇంజమూరి, డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్ : మా ఆయి ప్రొడక్షన్స్ LLP, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి, దర్శకుడు: పవన్ ప్రభ.