గ్రామీణ వాతావరణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. నేటికీ ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తో సినిమాలు వస్తూనే వున్నాయి. గ్రామీణ జీవితం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు… వాటి వ్యవహారాలను బేస్ చేసుకొని వెండితెరపై కొత్త కొత్త కథలు ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. తాజాగా నరేన్ హీరోగా పరిచయం అవుతూ అతని సరసన దీపాలి శర్మ అనే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి నిర్మించిన చిత్రం `ఊరికి ఉత్తరాన`. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ సంయుక్తంగా నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇతర పాత్రల్లో రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు నటించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో శంకర్ పటేల్(రామరాజు) గ్రామ పెద్ద. ఆయన ప్రేమ వివాహాలకు దూరం. పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకోవాలని ఓ కట్టుబాటు విధిస్తాడు. దాన్ని అతిక్రమించిన వారిని తలకిందులుగా ఉట్టి కట్టి తలను పగలగొట్టి శిక్ష విధిస్తాడు. అలాంటి శంకర్ పటేల్ మేన కోడలు శైలు(దీపాలి శర్మ) పట్నంలో పాలిటెక్నిక్ చదువుతూ వుంటుంది. అదే గ్రామానికి చెందిన కరెంట్ రాజు(నరేన్) కూడా అదే కాలేజ్ లో చేరతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టంగా వున్నా.. దాన్ని ఎప్పుడూ బర్గతపరచరు. కట్ చేస్తే.. వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో చార్మినార్ చూడటానికి వస్తారు. అయితే హఠాత్తుగా శైలు ట్రైన్ లో తప్పిపోతుంది. మరో వైపు ఊళ్ళో వీళ్ళిద్దరూ లేచిపోయారనే పుకారు పుడుతుంది. మరి తప్పిపోయిన శైలు ఆచూకి లభించిందా? అలా ఎందుకు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది? వీళ్ళకి శంకర్ పటేల్ ఎలాంటి శిక్ష విధించాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు ఇప్పిటికీ డిమాండ్ వుండనడానికి ఊరికి ఉత్తరాన సినిమా కథను బట్టే అర్థం అవుతుంది. ఎంత ప్రపంచం టెక్నాలజీ చుట్టూ తిరిగినా ఊళ్ళో కట్టు బాట్లు మారలేదని చెప్పడానికి దర్శకుడు సతీష్ ఎంచుకున్న కథ… దాన్ని నడిపించడానికి ఎంచుకున్న హీరో నరేన్, హీరోయిన్ దీపాలి శర్మల పాత్రలను చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే సాగిపోతుంది. సినిమా ఆద్యంతం హిలేరియస్ కామెడీ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ ఎంటర్టైన్ చేస్తుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా రాసుకున్న సీన్స్ అన్నీ మంచి ఫీల్ గుడ్ అనిపిస్తాయి.
హీరో నరేన్ నటన అద్భుతంగా ఉంది. ఓ చిన్న సినిమాను తన నటనతో రెండు గంటలకు పైగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మామూలు విషయం కాదు. ఇటీవల ఎస్ ఆర్ కల్యాణ మండపంతో దూసుకొచ్చిన కిరణ్ అబ్బవరంలాగ.నరేన్ కూడా మంచి ఈజ్ ఉన్న నటుడని ఇందులో తనని చూస్తే తెలిసి పోతుంది. ఎక్కడా తొణకాకుండా. ఇంతకు ముందు ఓ పది పదిహేను చిత్రాలు చేసిన నటుడిగా తన హావభావాలతో మెప్పించారు. దీపాలి శర్మ అచ్చం తెలుగు అమ్మాయిలా గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంది. గ్రామ పెద్దగా శంకర్ పటేల్ పాత్రలో రామరాజు ఎప్పటిలాగే అలరించారు. కట్టుబాట్లను అతిక్రమించిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదనే గ్రామ పెద్ద పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ ఫణి, ఆనంద్ చక్రపాణి, జగదీష్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు సతీష్ అండ్ టీమ్ రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా బాగా నవ్వించాడు. డైలాగ్స్ బాగున్నాయి. భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం, పట్టణ వాతావరణం బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండు. నిర్మాత ఖర్చుకి వెనుకాడలేదని వరంగల్ సెట్ ని చూస్తే అర్థం అవుతుంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మంచి పంచ్ డైలాగులతో బాగా నవ్విస్తుంది. గో అండ్ వాచ్ ఇట్!!!
రేటింగ్: 3