పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ లోని జనగణ మన పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకుడు జాగర్లమూడి క్రిష్, దర్శకుడు సురేందర్ రెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, దర్శకులు సాగర్ చంద్ర, మైత్రీ మూవీస్ నిర్మాత రవి శంకర్ నిర్మాత ఏఎం రత్నం, నిర్మాత బండ్ల గణేష్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ తాళ్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా.. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలలేం. కొందరిని ఇష్టపడటమే గానీ వదులుకోవడం ఉండదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి మీరు పదో తరగతి బాగా పాసయ్యారు అంటే కింద నుంచి పై దాకా చూస్తారు. పవన్ గారికి హిట్స్, సూపర్ హిట్స్ అంతే. ఆయన చూడని విజయాలా, ఆయన సాధించని రికార్డులా, ఆయన చూడని బ్లాక్ బస్టర్లా, ఆయన సృష్టించని చరిత్రలా, ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం అంతే. పవన్ గారు కొత్త చరిత్ర కోసం అడుగులు వేస్తున్నారు. ఇటు సినిమాలూ చేస్తున్నారు. చేయాలి కూడా. ఒక ఫ్రెండ్ నాతో అన్నాడు ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు అని. నేను చెప్పాను. ఒరేయ్ ఆయనకు మనలా పాల వ్యాపారం, మందు వ్యాపారం, కోళ్ల వ్యాపారం ఇలాంటివేవీ తెలియదు. ఆయనకు తెలిసిందల్లా బ్లడ్ వ్యాపారం. రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటతో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తుంటారు అన్నాను. కష్టాల్లో ఉన్న వారికి తను చెమటోడ్చి సంపాదించిన కోటి రూపాయలతో ఇన్సురెన్స్ చేయించిన గొప్ప వ్యక్తి ఆయనరా అని నా ఫ్రెండ్ ను తిట్టాను. పవన్ గారి నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అంజనీ పుత్ర పావన సుతనామ అని ఊరికే అనలేదు. చాలా మంది పుడతారు గిడతారు. కొందరే చరిత్రలో మిగిలిపోతారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ సినిమా వెనక సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అదీ పవన్ కళ్యాణ్. పవన్ గారికి ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేద్దాం అని వెళ్తాను. ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కళ్లు చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆ కళ్లలో అంత నిజాయితీ ఉంటుంది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా.
పవన్ గారికి పొగరు అన్న ఓ వ్యక్తికి.. పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసం కట్టుకున్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా. బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా. పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. అన్నారు.