నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై వశిష్ట దర్శకత్వంలో హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్, దిల్‌రాజు, దర్శకుడు వశిష్ట, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ శివరాం, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి, గుంటూరు డిస్ట్రిబ్యూటర్ ఎ.ఎం.ఆర్, బేబి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ‘‘2020 మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. కొన్ని రోజులకే పాండమిక్ కారణంగా లాక్ డౌన్ చేశారు. అది ఏకంగా మూడున్నర నెలల పాటు కొనసాగింది. దీంతో తెలియని టెన్షన్ మొదలైంది. తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాం. మళ్లీ సెకండ్ వేవ్ అన్నారు. మళ్లీ లాక్ డౌన్ అయ్యింది. నేనైతే నెర్వస్ ఫీలయ్యాను. నాకైతే కొత్త జోనర్. విజువల్స్ మీద కాన్‌సన్‌ట్రేట్ చేసి పెద్ద సినిమా చేస్తున్నాం. ఏమవుతుందోనని టెన్షన్‌లో ఉన్నాను. లక్కీగా అన్నీ ఓపెన్ అయ్యాయి. సినిమా పూర్తయ్యింది. మే ఎండింగ్, జూన్ నెలల్లో మళ్లీ జనాలు థియేటర్‌కు రావటం లేదని మళ్లీ మొదలు పెట్టారు. మళ్లీ టెన్షన్ మొదలైంది. ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ కొంత మంది మాట్లాడే మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ సినిమాను తీసి ప్రేక్షకుల ముందు పెడితే వాళ్లు బ్రహ్మరథం పడతారని నమ్మాను. అదే నిజమైంది. ట్రైలర్ దగ్గర నుంచి ప్రేక్షకులు మాకు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. మా నందమూరి వీరాభిమానులకు థాంక్స్. కీరవాణిగారు తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రాణం పోశారు. మా ఛోటా కె.నాయుడుగారు నన్ను భరించారు. అలాగే మా టెక్నీషియన్స్‌కి చాలా థాంక్స్. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ జన్మించినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్టకు ధన్యవాదాలు. సినిమాను చూసి నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన మా దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్‌కు థాంక్స్. నేను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనముంటూనే ప్రేక్షకులందరికీ నచ్చేలా ప్రయత్నిస్తాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను’’ అన్నారు.
దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ… ‘‘నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌గారికి, నిర్మాత హరిగారికి థాంక్స్. సినిమాను అద్భుతంగా చూపించి మా ఛోటన్నకు, నాకు అండగా నిలిచిన మా టీమ్‌కి ధన్యవాదాలు. ఆనందంతో మాటలు రావటం లేదు. సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ… ‘‘జూన్ 3న మేజర్, విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ తరుణంలో ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది. ఏం చేయాలనే విషయాలను కథల దగ్గర నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆగస్ట్ 5న మళ్లీ రెండు సినిమాలు విడుదలై సినీ ఇండస్ట్రీకి ఊపిరిని పోశాయి. బింబిసార, సీతారామం చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇండస్ట్రీ అంతా ఓ ఫ్యామిలీ. సినిమాలు ఆడుతుంటే ఓ కళ వస్తుంది. రెండు నెలల తర్వాత ఇండస్ట్రీకి ఆ కళను తీసుకొచ్చిన నిర్మాతలకు ముందుగా థాంక్స్. ఈరోజు ఇండస్ట్రీ స్ట్రగుల్‌లో ఉంది. పాండమిక్ తర్వాత సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి చాలా హోం వర్క్ చేస్తున్నాం. బింబిసార విషయానికి వస్తే సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ఓ సినిమా సక్సెస్ అయ్యిందంటే కారణం.. సినిమా కాస్ట్. సినిమాను నిర్మాత పరిమిత బడ్జెట్‌లో చేసుకని దాన్ని తన డిస్ట్రిబ్యూటర్స్‌కు రీజన్‌గా ఇవ్వటం.. వారికి మూడు రోజుల్లోనే డబ్బులు రావటమే కొలమానం. నిర్మాత హరికృష్ణ ఈ సినిమాపై రెండున్నరేళ్లుగా హోం వర్క్ చేసుకుంటూ డైరెక్టర్, టెక్నీషియన్‌తో మాట్లాడుకుంటూ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుని మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓ కొత్త దర్శకుడికి ఇంత మంచి పేరు రావటం అనేది మామూలు విషయం కాదు. దాని వెనుక వశిష్ట కృషి ఎంతో ఉంది. తను హిట్ కొట్టం వేరు. ఇండస్ట్రీ స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు ఇంస్ట్రీకి హిట్ ఇవ్వటం గొప్ప విషయం. అందుకు వశిష్టకు థాంక్స్. నిర్మాత హరికి, డైరెక్టర్ హరికి కళ్యాణ్‌రామ్‌గారు తోడయ్యారు. దీంతో బడ్జెట్‌లే కాదు సక్సెస్ కూడా సాధించవచ్చునని నిరూపించారు. కళ్యాణ్‌రామ్‌గారి పెర్ఫామెన్స్ చూసి వావ్ అనిపించింది. సినిమా కొట్టేస్తుందనిపించింది. అయితే ఏ రేంజ్‌లో కొడుతుందో తెలియాలంటే సినిమా థియేటర్స్ కి వెళ్లే వరకు వెయిట్ చేయాలని రిలీజ్ వరకు చూశాను. నిర్మాత హరిగారు నా చేతిలో పెట్టి పట్టుబట్టి రిలీజ్ చేయించారు. మార్నింగ్ షో తర్వాత సూపర్ డూపర్ హిట్ టాక్ రావటంతో అందరి కళ్లలో ఆనందం కనిపించింది. పటాస్, శతమానం భవతి, ఎఫ్ 3 సినిమాలు మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయ్యింది. నాలుగో రోజునే ప్రాఫిట్స్ రావటం అరుదైన విషయం. ఈ వరుసలోకి బింబిసార వచ్చి చేరింది. కీరవాణిగారు మూడు నెలలు బ్యాగ్రౌండ్ స్కోర్‌కి టైమ్ తీసుకుని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఎడిటర్ తమ్మిరాజు ముందు నుంచి సినిమా బాగా వస్తుందని చెబుతూనే ఉన్నాడు. తను అన్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ… ‘‘మా సినిమాను దిల్‌రాజుగారు తీసుకున్నారని తెలియగానే సినిమా సూపర్ హిట్ అని అనుకున్నాం. మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయి. ఈరోజు ఉదయం కూడా బన్ని ఫోన్ చేసి మాట్లాడాడు. మంచి సినిమా తీస్తే జనాలు థియేటర్‌కి వస్తారని, కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని చెబుతూ అప్రిషియేట్ చేశారు. అలాగే కథ చెప్పగానే నమ్మకంతో సినిమా చేసిన నిర్మాత హరిగారికి, సినిమాలో యాక్ట్ చేసిన కళ్యాణ్ రామ్‌గారికి ముందుగా అభినందనలు. దర్శకుడు వశిష్ట సినిమాను అరటిపండు వలిచినట్లు చూపించాడు. వంద సినిమాలు చేసినంత బాగా సినిమాను డైరెక్ట్ చేశాడు. మా అందరికీ బ్యాక్ బోన్‌గా నిలిచి కర్త, కర్మ, క్రియగా నిలిచిన హరికి అభినందనలు. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.