యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె పంచుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివి.
కరోనా తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ?
నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వరుస సినిమాలు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
వరుస సినిమాలు చేయడం వలన మీ కెరీర్ కి ఉపయోగపడే సరైన కథలు ఎంచుకుంటున్నారా లేదా ? అనేది చెక్ చేస్తుంటారా?
నేను వచ్చి ఏడాదే అవుతుంది. రాంగ్ ఛాయిస్ వుంటుందని అనుకోను. నాకు వర్క్ అంటే ఇష్టం. వర్క్ లేకపోతేనే రాంగ్ అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తాను. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ వుండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పిరియన్స్ గానే తీసుకుంటాను.
‘మాచర్ల నియోజకవర్గం’లో మీ పాత్ర గురించి చెప్పండి ?
‘మాచర్ల నియోజకవర్గం’లో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది.
మాచర్ల నియోజక వర్గం కథ ఎలా ఉండబోతుంది ?
కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు గానీ.. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. చాలా అద్భుతమైన కథ. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా వుంటుంది. తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఈ చిత్రం ఒక లాంగ్ వీకెండ్ లోవస్తోంది. ఫ్యామిలీస్ అంతా థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తారు.
నితిన్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
నితిన్ గారు నాకు మంచి స్నేహితులయ్యారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా వుంది. ఇరవై ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో వున్నారు. నన్ను కూడా దీవించండని కోరాను. జయం సినిమాలో ఎలా వున్నారో.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్ గా వున్నారు. ఆయన నిజాయితీ, అమాకత్వం వలనే ఇది సాధ్యమైయిందని భావిస్తాను.
మాచర్లలో షూటింగ్ అనుభవం గురించి ?
మాచర్ల సెట్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ గారు చాలా మంది నటీనటులు వున్నారు. అందరూ నన్ను ఎంతో ఇష్టంగా చూసుకున్నారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. వారు మాట్లాడే విధానంలో నాపై చాలా ప్రేమ వుందని అర్ధమౌతుంటుంది. చాలా మంది నాకు ఫుడ్, స్వీట్స్ పంపించారు. వారు చూపిన ప్రేమకి చాలా థాంక్స్ చెప్తాను.
దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి ?
రాజశేఖర్ గారు చాలా కూల్ పర్శన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా ఎక్సయిట్ అవుతుంటారు. ప్రతి సీన్ ని చాలా క్లియర్ గా చెప్తారు. ఫస్ట్ టైం దర్శకుడిలా అనిపించరు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటాను.
ఉప్పెన తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర చేయలేదనే ఆలోచన వస్తుంటుందా ?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంటుంది. నాలో వెర్సటాలిటీ నిరూపించుకొని, మంచి ఎంటర్ టైనర్ కావాలని వుంటుంది. ఉప్పెన తర్వాత బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలౌతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్త కథల విషయంలో కూడా కొంచెం సెలక్టివ్ గా ఉంటున్నా.
ఉప్పెనలో చాలా సాంప్రదాయంగా అనిపించారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో చాలా ఇష్టపడ్డారు. ఆ ఇమేజ్ మీకు భారంగా అనిపిస్తుందా ?
ఉప్పెనలో నా పాత్ర ప్రేక్షకులకు నచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రని ఎంతగానో రిలేట్ చేసుకున్నారు. అయితే అన్నీ అలాంటి పాత్రలే చేయాలని లేదు కదా.. నటనకు వెర్సటాలిటీ ముఖ్యం. అందుకే ఉప్పెన తర్వాత వెంటనే శ్యామ్ సింగరాయ్ లో పూర్తిగా భిన్నంగా వుండే పాత్ర చేశాను. నా మొదటి సినిమాలో విజయ్ సేతుపతి లాంటి గొప్ప వర్సటాలిటీ వున్న స్టార్ తో పని చేశాను. బహుసా వెర్సటాలిటీ విషయంలో ఆయన స్ఫూర్తి కూడా వుందని భావిస్తున్నా.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ఆలోచన వచ్చిందా ?
ఇప్పటికి ఆ ఆలోచన లేదు. అది చాలా భాద్యతతో కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తాను. ఉప్పెన తర్వాత అలాంటి రోల్స్ వచ్చాయి. కానీ సిమిలర్ గా ఉంటాయని చేయలేదు.
బాలీవుడ్ అవకాశాలు వచ్చాయా ?
వచ్చాయి. కానీ చేసే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఆనందాన్ని ఇస్తుంది.
సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ?
నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ వుండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.
ఫ్రెండ్ షిప్ డే ప్లాన్స్ ఏమిటి ? మీ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ వున్నారా ?
ముంబైలో వున్నప్పుడు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకునేవాళ్ళం. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే. అమ్మ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. చిన్నప్పటి స్నేహితులు కూడా వున్నారు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సూర్య గారితో ఒక సినిమా. అలాగే నాగచైతన్యతో మరో సినిమా. ఇంద్రగంటి గారి సినిమా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి.