సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తూ ఉద్యమాల్లో అయితేనేం.. పార్టీ కార్యక్రమాల్లో అయితేనేం కలిసే పాల్గొంటున్నాయి. అయితే.. రెండు పార్టీల మధ్య కొన్ని రోజుల పాటు సఖ్యత ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎందుకో చెడింది. దీంతో బహిరంగంగానే ఎన్నికల ప్రచారం, ప్రెస్ మీట్‌ల వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వెల్లగక్కుతూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇది ఏపీ వరకే కాదు.. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థి విషయమై చాలా రోజులుగా నువ్వా.. నేనా అన్నట్లుగా బీజేపీ-జనసేన ఉంది. తమకే టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. అయితే.. అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం మాత్రం దక్కలేదు. చివరికి బీజేపీ తరఫునే అభ్యర్థి రంగంలోకి దిగుతారని కేంద్ర అధిష్టానం తేల్చేయడంతో చేసేదేమీ లేక పవన్ మిన్నకుండిపోయారు. దీంతో బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పదే పదే అవమానిస్తున్నారు!?
ఈ ఘటన మరువకముందే.. తెలంగాణ బీజేపీ తమ మిత్రపక్షమైన జనసేనను తీవ్ర స్థాయిలో విమర్శించింది. దీంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని మొత్తం వెల్లగక్కారు. తెలంగాణ బీజేపీ.. మా జనసేన పార్టీని అవమానించింది. బీజేపీ జాతీయ నాయకత్వం మాతో సక్యతగానే ఉంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మమల్ని పదే పదే అవమానిస్తున్నారు. అందుకే బీజేపీని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవికి మద్దతు ప్రకటిస్తున్నాం. మా క్యాడర్ సూచన మేరకు పీవీ కుమార్తె వాణిదేవికి మద్దతు ఇస్తున్నాం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
అడగడుగునా అవమానాలే..!
వాస్తవానికి తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ జనసేనను కానీ ఆ పార్టీ కార్యకర్తలను కానీ బీజేపీ అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు.. నిన్న గాక మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను పట్టించుకోలేదు. ఇవన్నీ అటుంచితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారానికి రాగా.. జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేయగా వారిని తీవ్రంగా అవమానించి పర్యటనలో పాల్గొనకుండా తోసేయడం ఇలా అడగడుగునా జనసేనకు అవమానం జరగడం గమనార్హం. ఇలా వరుస అవమానాలతో విసిగిపోయిన జనసేనాని ఇవాళ తన అసంతృప్తినంతటినీ ఇలా ఆవిర్బావ వేడుక వేదికగా వెల్లగక్కారు. మరి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు.. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.