ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ఓ ట్రెండ్ సెట్టరే. మ్యాచ్‌లో ఉన్నన్నాళ్లూ అతడి హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్.. మామూలుగా ఉండేవి కావు. ఇక ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా అతడు ట్రెండ్స్ సెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న ధోనీ ఫొటోను షేర్ చేసింది. అంతేగాక ఈ అవతారం గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండంటూ చర్చకు తెరలేపింది. పూర్తిగా గుండు చేయించుకుని బౌద్ధ సన్యాసులు ధరించే దుస్తులు ధరించిన ధోనీ ఫోటో ఇప్పుటు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ధోనీని ఈ గెటప్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోన్నారు. ఈ కొత్త అవతారం ఏంటంటూ.. ఆన్‌లైన్‌లో చర్చించుకుంటున్నారు.
ఐపీఎల్ 2021 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, చెన్నైలో ప్రాక్టీస్ చేస్తుండాల్సిన ధోనీ ఇలా బౌద్ధ సన్యాసిలా మారిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన ధోని అకస్మాత్తుగా ఇలా సన్యాసిగా మారిపోవడం ఏంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కాగా.. ఈ కొత్త గెటప్ ఐపీఎల్ – 2021కు సంబంధించిన ఓ వాణిజ్య ప్రకటనలో భాగమని కొందరు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ.. అక్కడ సీఎస్‌కే క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ధోనీ సాథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన చేసింది. సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసింది. ఇక చివర్లో వరుస విజయాలు నమోదు చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి గ్రూప్ దశలోనే టోర్నీనుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది ఎలాగైనా సత్తా చాటాలని చెన్నై జట్టు పట్టుదలగా ఉంది.